కొత్త ప్రాజెక్టులను అపెక్స్‌ ఆపమంది..!

7 Oct, 2020 11:59 IST|Sakshi
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద జరుగుతున్న సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు పనులు (ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో మంగళవారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లో ఉమ్మడి వరంగల్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది. కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్, గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో కొత్తగా చేపడుతున్న తొమ్మిది ప్రాజెక్టుల పనులను తక్షణమే ఆపాలని కేంద్రమంత్రి ఆగస్టు 11న ఆదేశాలు జారీ చేశారు. అయితే, తొమ్మిది ప్రాజెక్టుల జాబితాలో ఏడు తెలంగాణకు సంబంధించినవి కాగా, ఇందులో నాలుగు ఉమ్మడి వరంగల్‌లోనివే ఉన్నాయి. తాజాగా మంగళవారం ఇదే అంశంపై కేంద్రమంత్రి షెకావత్‌ రెండు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా, మరోమారు జిల్లా ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. 

ఆపాలన్న ప్రాజెక్టులు ఇవే...
కేంద్రం ఆపాలని సూచించిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణకు సంబంధించినవి ఏడు ఉన్నాయి. తెలంగాణ సాగునీటి సరఫరా పథకం, సీతారామ ఎత్తిపోతలు, లోయర్‌ పెనుగంగ నదిపై బ్యారేజీలు, కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతలు, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలపై అభ్యంతరాలు చెప్పింది. ఇందులో రామప్ప, పాకాల సరస్సు మళ్లింపు, కాళేశ్వరం మూడో టీఎంసీ, తుపాకులగూడెం(సమ్మక్క సాగర్‌), గోదావరి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి వరంగల్‌లోని కీలక ప్రాజెక్టులు. తెలంగాణకే తలమానికంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం కూడా తుది దశకు చేరింది. తుపాకులగూడెం పనులు శరవేగంగా సాగుతుండగా, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపుపై కూడా జల్‌శక్తి శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మీడియా సమావేశంలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌దేనని గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేయడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది.

డీపీఆర్‌ల తయారీపై కసరత్తు
అపెక్స్‌ కౌన్సిల్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలను వారంలోగా సిద్ధం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. మంగళవారం సమావేశం ముగిసిన వెంటనే నీటిపారుదలశాఖ కార్యదర్శి ఉమ్మడి వరంగల్‌లో ప్రాజెక్టుల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం మూడో టీఎంసీతో సహా అభ్యంతరాలు వ్యక్తమైన నాలుగు ప్రాజెక్టులపైనా నివేదికలు సిద్ధం చేయడంపై దృష్టి సారించారు. ఈ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతల మూడో దశ, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలకు సంబంధించి పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంజినీర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. అపెక్స్‌ కౌన్సిల్‌కు ముందే నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. కౌన్సిల్‌ తర్వాత కూడా స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ కాళేశ్వరం ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం పరిధిని మార్చి రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలు మళ్లించేలా సామర్థ్యాన్ని పెంచింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలనకు ఇవ్వకుండానే పనులు చేపట్టారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు పరిధి లేదా వ్యయంలో మార్పు జరిగితే మళ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుందని కౌన్సిల్‌ సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సు వరకు మళ్లింపు పథకంపై కొత్త డీపీఆర్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు