మమ్మల్ని ఏపీకి బదిలీ చేయండి 

8 Apr, 2021 03:35 IST|Sakshi
బస్‌ భవన్‌ ఎదుట నినాదాలు చేస్తున్న ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులు 

ఏపీ స్థానికత ఉన్న టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల విజ్ఞప్తి

బస్‌భవన్‌లో ఉన్నతాధికారులకు వినతి 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపుతూ అక్కడి ప్రభుత్వం రిలీవ్‌ చేసిన నేపథ్యంలో, టీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న ఏపీకి చెందిన వారు తమను సొంత రాష్ట్రానికి పంపాలని కోరుతున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ స్థానికత ఉన్నవారు తెలంగాణ పరిధిలో విధులు నిర్వర్తించారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో పై స్థాయి అధికారులు మొదలు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు ఏపీకి వెళ్లిపోయారు. కానీ డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది, శ్రామిక్‌లు 600 మంది ఇక్కడే ఉండిపోయారు. సాంకేతిక కారణాలతో పైస్థాయికి చెందిన నలుగురైదుగురు కూడా ఇక్కడే ఉండిపోయారు. అయితే వీరిలో 446 మంది ప్రస్తుతం ఏపీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.  

మేమిక్కడ.. మా కుటుంబాలు అక్కడ 
తమకు ఏపీలోనే ఓటు హక్కు ఉందని, ఆధార్‌ కార్డులాంటివి కూడా ఏపీ చిరునామాతోనే ఉన్నాయని ఆ ఉద్యోగులు చెబుతున్నారు. తమ కుటుంబాలు కూడా అక్కడే ఉన్నాయని, తాము మాత్రం ఇక్కడ ఉండి విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో వారు బస్‌భవన్‌కు చేరుకుని ఈడీ అడ్మిన్, చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. తమను ఎలాగైనా ఏపీకి బదిలీ చేయాలని కోరారు. దీంతో రెండు ప్రభుత్వాలు అంగీకరిస్తే రిలీవ్‌ చేయటానికి తమకు అభ్యంతరం లేదని, ఏపీ సానుకూలంగా స్పందించేలా చూసుకోవాలని అధికారులు చెప్పినట్టు ఉద్యోగులు తెలిపారు. రెండు రాష్ట్రాల సీఎంలు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

చదవండి: సామరస్యంగా పరిష్కరించుకోండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు