కరెంట్‌ బిల్లు రాయితీకి  దరఖాస్తు చేసుకోండి.. 

30 May, 2021 03:00 IST|Sakshi

లాండ్రీ, దోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు రాయితీ

జూన్‌ 1 నుంచి అప్లికేషన్ల స్వీకరణ: మంత్రి గంగుల 

సాక్షి, హైదరాబాద్‌: లాండ్రీషాపులు, దోబీఘాట్లు, సెలూన్ల కరెంటు రాయితీ కోసం జూన్‌ ఒకటో తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలి పారు. 250 యూనిట్ల వరకు కరెంట్‌ బిల్లు రాయితీ కోసం ఆన్‌లైన్‌ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్టవ్యాప్తంగా 2 లక్షల రజక కుటుం బాలకు చెందిన లాండ్రీషాపులకు, దోబీఘాట్లకు, నాయీబ్రాహ్మణులకు చెందిన 70 వేల సెలూన్లకు లబ్ధి చేకూరుతుందన్నారు.

250 యూనిట్ల కరెంటు రాయితీని ప్రతి నెలా వారికి ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. ఈ సదుపాయాలు ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉంటాయని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఆన్‌లైన్‌లో  www.tsobmms.cgg.gov.in ద్వారా రజక, నాయీబ్రాహ్మణ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, షాపు వివరాలు,  అప్‌లోడ్‌ వంటి మూడు ప్రధాన విభాగాలుగా ఉండే ఈ ఆన్‌లైన్‌ దరఖాస్తులో పేరు, జెండర్, మొబైల్, ఆధార్‌ నంబర్, కుల ద్రువీకరణపత్రం, ఉపకులం, యూనిట్‌ పేరు, యూనిట్‌ చిరునామాతోపాటు తన పేరున/అద్దె నివాసానికి చెందిన కమర్షియల్‌ ఎలక్ట్రికల్‌ కన్జూమర్‌ నంబర్‌ (కరెంట్‌ మీటర్‌ నంబర్‌) వంటి వివరాల్ని ఎంటర్‌ చేసి వీటికి సంబంధించి ఫొటో, తాజా విద్యుత్‌ బిల్లు, షాపు/యూనిట్‌ ఫొటో, షాపునకు సంబంధించి అద్దె నివాసంలో ఉంటే లీజు/అద్దె ఒప్పందం ఫొటోలతోపాటు ఆయా స్థానిక విభాగాలైన గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు చెందిన కార్మిక లేదా వాణిజ్య లైసెన్స్‌లను అప్‌లోడ్‌ చేసి స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు