మీకు 45 ఏళ్లు దాటాయా.?

25 Mar, 2021 02:36 IST|Sakshi

రోజుకు లక్ష మందికి టీకా..!

ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ..

వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి అందించాలని లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: రోజుకు లక్ష మందికి టీకా వేసే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కదిలింది. దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా 45 ఏళ్లు పైబడిన వారందరికీ వచ్చే నెల 1 నుంచి టీకా వేయాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్ర వైద్య వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా వేస్తారు. మరో వెయ్యి ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరగనుంది. మొత్తం రోజుకు లక్షకు తగ్గకుండా లబ్ధిదారులకు టీకా వేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45-59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కొన్ని సవరణలు చేసి 45-59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా వారందరికీ టీకాలు వేస్తారు. దీనివల్ల ఆ వయసు వారు వచ్చే నెల 1 నుంచి వైద్యుల నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండానే, వారి వయసును తెలిపే గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని అధికారులు వెల్లడించారు.

కరోనా విజృంభణతో వ్యాక్సినేషన్‌లో వేగం.. 
రాష్ట్రంలో కరోనా కేసులు ఐదారు నెలల తర్వాత మరింతగా విజృంభిస్తున్నాయి. మరి కొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వైపు ప్రజలు మాస్క్‌ ధరించడం, కరోనా జాగ్రత్తలు పాటించడంతోపాటు, అర్హులైన వారంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్య వర్గాలు కోరుతున్నాయి. అందుకే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నారు. జనవరి 16 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 10 లక్షల మొదటి, రెండో డోసు టీకాలు మాత్రమే వేశారు. అయితే 45 ఏళ్లు పైబడిన వారందరూ కలిపితే రాష్ట్రంలో కోటి మంది అర్హులు ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు లెక్కలు వేశాయి. మొదట వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా వేశారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 10.10 లక్షల వ్యాక్సిన్లు వేశారు.

వాస్తవంగా ఈ నాలుగు కేటగిరీలు కలిపి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మందికి టీకా వేయాలని భావించారు. అందులో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు దాదాపు 6 లక్షలు కాగా, 10 లక్షల మంది 45-59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు 54 లక్షల మంది ఉన్నారు. వీరుకాక 45-59 ఏళ్ల మధ్య వయసున్న వారు సుమారు 30 లక్షల మంది ఉంటారని అంచనా. ఇలా మొత్తం కోటి మందికి టీకాలు వేయాల్సి ఉంది. టీకా వేగవంతం చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 20 పడకలకు పైగా ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ జరగనున్నట్లు చెబుతున్నారు.   

>
మరిన్ని వార్తలు