7 గంటలు.. 75 సార్లు..

17 Jul, 2022 10:40 IST|Sakshi

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): కృషి ఉంటే సాధించనిది ఏదీ లేదని నిరూపించింది కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన పండుగ అర్చన. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆజాదికా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయగీతం జనగణమన ఐదు చరణాల్లో 7 గంటల్లో 75 సార్లు పాడింది. కరీంనగర్‌లోని ఓ హోటల్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘనత సాధించిన అర్చన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించింది. నగరానికి చెందిన పండుగ కీర్తి కుమార్, దేవపాలా కూతురు అర్చన. ఐదోతరగతి నుంచే జెండా పండుగల్లో జాతీయ గీతాన్ని ఆలపించేది. నాలుగు పీజీలు పూర్తిచేసిన అర్చన నగరంలోని ఓ ప్రయివేటు కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా ఉద్యోగం చేస్తోంది.


అర్చనను సన్మానిస్తున్న సీపీ సత్యనారాయణ 

లాక్‌డౌన్‌ తెచ్చిన ఆలోచన
చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు అధికంగా ఉన్న అర్చన 2020లో వచ్చిన కరోనా లాక్‌డౌన్‌ సరికొత్త ఆలోచనను తీసుకొచి్చంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన అర్చన జాతీయ గీతాన్ని ఆలపించే సంకల్పాన్ని పెట్టుకుంది. ఈ అంశంలో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాలంటే ఏం చేయాలనే పలువురి సలహాలు తీసుకుంది. ఏడాదికాలంగా సీరియస్‌గా సాధన చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో సంపూర్ణ జనగణమనను ఐదు చరణాల్లో 75 సార్లు 7 గంటల పాటు పాడి రికార్డుకెక్కింది. మన జాతీయగీతానికి ఉన్న పవిత్రతను ప్రపంచానికి చాటేందుకే ఈ కార్యక్రమం చేసినట్లు అర్చన తెలిపింది.

మరిన్ని రికార్డులు సాధించాలి
అంతకుముందు ఉదయం ఈ కార్యక్రమాన్ని మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ప్రారంభించారు. అనంతరం అర్చనను పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. పట్టుదలతో జాతీయ గీతాన్ని పాడి మన జాతీయ గీతానికి ఉన్న మహాత్యాన్ని తేలియజేసేలా ప్రయత్నం చేస్తున్న అర్చన రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ముగింపు కార్యక్రమానికి అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ హాజరై అర్చనను అభినందించారు. చొప్పరి జయశ్రీ, గుంజపడుగు హరిప్రసాద్, సాదవేణి వినయ్, పొన్నం అనిల్‌గౌడ్, తిరుపతి, కుమార్, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు