1200 ఏళ్ల నాటి వస్తువులు.. ఎలా ఉన్నాయో తెలుసా?

20 Apr, 2021 08:53 IST|Sakshi

సిద్దిపేట పరిసర గ్రామాల్లో వందల ఏళ్ల నాటి చారిత్రక అవశేషాలు వెలుగులోకి

700 ఏళ్ల నాటి నూనె గానుగ, 1200 ఏళ్ల నాటి వసతి గదుల గుర్తింపు

కాపాడకుంటే త్వరలోనే అన్నీ మాయం 

సాక్షి, హైదరాబాద్‌: మనిషి మొదటి మిత్రుడు రాయే. రక్షణకు ఆయుధం అదే. రోజువారీ జీవనంలో పనిముట్టూ అదే.. నివాసమూ అదే. చనిపోయిన తర్వాత శాశ్వత ఆవాసం వాటి మధ్యే. రామప్ప లాంటి విశ్వ విఖ్యాత దేవాలయ నిర్మాణం అంతా రాతితోనే జరిగింది. కానీ ఆ రాళ్ల నిండా కళాత్మకత ఉట్టిపడుతుంది. కానీ ఎలాంటి నగిషీలు లేకుండా రాళ్లను వాడిన తీరు మాత్రం చాలా అబ్బుర పరుస్తుంది. అలాంటి అలనాటి గుర్తులు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

ఇటీవల మర్కూక్‌ మండలం దామరకుంట ప్రాంతంలో కొత్త తెలంగాణ బృందం ప్రతినిధులు శ్రీరామోజు హరగోపాల్, అహోబిలం కరుణాకర్, చంటి, నసీర్, కొలిపాలక శ్రీనివాస్, ఔత్సాహిక పరిశోధకులు కందుల వెంకటేశ్‌లు సందర్శించినప్పుడు అలనాటి చారిత్రక అవశేషాలు ఎన్నో వెలుగు చూశాయి. రాతియుగం నాటి గుర్తులు, తదుపరి నిర్మాణాలు, వివిధ రాజవంశాల హయాంలో నిర్మితమైన శిథిల దేవాలయాలు కనిపించాయి. వాటిల్లో రెండు గుర్తులు ప్రత్యేకంగా నిలిచాయి. 

నూనెకు ఇదే సాధనం.. 
ఇటీవల కాలంలో గానుగ నూనెలకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. దీంతో యాంత్రిక గానుగలు విరివిగా వెలుస్తున్నాయి. కానీ వందల ఏళ్లనాడు గానుగలు కూడా రాతివే ఉండేవి. అందులో ఓ గానుగ దామరకుంట శివారు పొలాల్లో కూరుకుపోయి ఉంది. అప్పట్లో ధనవంతుల ఇళ్లలో సొంత అవసరాలకు నూనె తీసేందుకు ఉండేవి. దేవాలయాల్లో నూనె అవసరం బాగా ఉండటంతో అక్కడ ఉండేవి. దీని పైభాగంలో వేరుశనగ, కుసుమ, నువ్వుల నూనె లాంటి వాటిని వేసి రుబ్బురోలు లాంటి దాన్ని ఏర్పాటు చేసి దానికి ఎద్దును కట్టి తిప్పే వారు. నలిగిన గింజల నుంచి నూనె కారి వెలుపలికి వచ్చేది.

ఇక ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు వాటిపై ఆధారపడి ఉండేవి. క్రమంగా ఆ పేరుతో ఓ కులమే ఏర్పాటైంది. వారే నూనె తీసి అమ్మేవారు. కొన్ని రాజుల కాలాల్లో గానుగపై నూనె తయారీకి సుంకం కూడా విధించినట్లు చారిత్రక ఆధారాలు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లాలో వెలుగు చూసిన ఓ శాసనంలో గానుగ నిర్వహించే వారు చెల్లించాల్సిన సుంకం వివరాలు వెలుగుచూశాయి. ఇలాంటి వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది.  

వెయ్యేళ్లు దాటినా నిలిచే.. 
రాష్ట్రకూటుల హయాంలో జైన బసదులు నిర్మితమయ్యాయి. జైన ఆరాధకులు తపస్సు చేసేందుకు ఎలాంటి ఆడంబరం, అలంకరణ లేకుండా చిన్నచిన్న గుదులు నిర్మించుకునేవారు. ముఖ్యంగా జైన దిగంబరులు వాటిని ఆశ్రయించేవారు. దామరకుంటలో పరుపు బండపై ఉన్న రాతి గూళ్లు అలాంటివే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. పెద్ద పెద్ద రాతి సల్పలను ఒకదానికొకటి ఆధారంగా ఉండేలా ఇంటర్‌ లాకింగ్‌ విధానంతో నిలిపి ఉంచేవారు.

పునాదులు, అనుసంధాన మిశ్రమాలు లేకుండా అనామతుగా నిలిపి చిన్న గూళ్లులాగా చేసిన నిర్మాణాలు 1200 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిలిచే ఉండటం విశేషం. ఆ తర్వాత ఇవి శివాలయాలుగా మారినట్టు పేర్కొంటున్నారు. శైవమతాచార్యుల సమాధులపై నిలిపే లింగ శిలలు వాటి పక్కనే ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. వాటిపై ఎలాంటి అలంకరణ, ఆడంబర గుర్తులుండవు. సిద్దిపేట పరిసర గ్రామాల్లో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఇలాంటి నిర్మాణాలను తొలగించి స్థానికులు రాళ్లను ఇతర అవసరాలకు తీసుకెళ్లిపోతున్నారు. ఫలితంగా ఇలాంటి అతిపురాతన నిర్మాణాలు క్రమంగా మాయమవుతున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది.   

మరిన్ని వార్తలు