వైరస్‌లో జన్యు మార్పులు ప్రమాదమా?

18 Dec, 2020 08:34 IST|Sakshi

వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంక్షలు 

మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుందేమోనన్న ఆందోళనలు 

అలాంటి విపత్తేమీ లేదని చెబుతున్న శాస్త్రవేత్తలు. 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌లో జన్యుమార్పులు జరుగుతున్న కారణంగా లండన్‌లో కోవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఈ కారణంగా డిసెంబర్‌ 16 నుంచి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నామని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ‘ఎన్‌501వై’అని పిలుస్తున్న ఈ కొత్త రకం వైరస్‌ ప్రమాదకరమా? జన్యుమార్పులు అన్నింటితోనూ చిక్కులేనా? అసలు మార్పులు ఎలా జరుగుతాయి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.. 

డీఎన్‌ఏలో మార్పులు జరిగితే మానవులకు అపూర్వమైన శక్తులు వస్తాయని పలు హాలీవుడ్‌ సినిమాల్లో చూపిస్తుంటారు. అయితే వాస్తవంలో ఇలాంటిదేమీ ఉండదని మనకూ తెలుసు. నిజ జీవితంలో డీఎన్‌ఏలో మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఇంకోలా చెప్పాలంటే పరిణామక్రమంలో జన్యుమార్పులు అత్యంత సాధారణమైన విషయం. జన్యు మార్పులను అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రొటీన్ల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో ఐదో వంతు భాగం ప్రొటీన్లే. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే ఎంజైమ్‌లు మొదలుకొని మన చర్మం, వెంట్రుకల వరకూ అన్నీ ప్రొటీన్‌ రూపాలే. దాదాపు 20 అమైనో యాసిడ్స్‌తో తయారవుతాయి. ఈ అమైనో యాసిడ్స్‌లో అత్యధికం ఒకేలా ఉంటాయి.. కానీ అవి చేసే పనుల ఆధారంగా వీటిని చాలా వర్గాలుగా విభజించవచ్చు. ఈ అమైనో యాసిడ్స్‌ను వాడుకుని బోలెడన్ని కాంబినేషన్లలో ప్రొటీన్లను తయారు చేయొచ్చు. మొత్తమ్మీద మానవ శరీరంలో దాదాపు 60 లక్షల రకాల ప్రొటీన్లు ఉంటాయని లెక్క! (చదవండి: ఎల్‌ఈడీ లైట్లతో కరోనా ఖతం!)

వైరస్‌లో మార్పుల కథేంటి? 
కరోనా వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ ఆధారితమైందని తెలిసే ఉంటుంది. మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో డీఎన్‌ఏ ఉంటే.. దాంట్లోని ఒక పోగు ఆర్‌ఎన్‌ఏ అన్నమాట. నిర్దిష్ట ప్రొటీన్‌ తయారీకి అమైనో యాసిడ్స్‌ను ఏ క్రమంలో కలపాలో తెలిపే సమాచారం ఆర్‌ఎన్‌ఏలో ఉంటుంది. ఆర్‌ఎన్‌ఏలో చోటు చేసుకునే మార్పుల ప్రభావం చాలా సందర్భాల్లో సానుకూలంగానే ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే.. జన్యుమార్పులు కాస్తా ప్రొటీన్‌ ధర్మాలను మార్చేసి వైరస్‌ను బలహీనపరుస్తుంది. శరీరం (డీఎన్‌ఏ) మనకు లాభాన్నిచ్చే అంశాలను మాత్రమే ఉంచుకుని హానిచేసే వాటిని తొలగిస్తుందని జీవపరిణామ సిద్ధాంతం చెబుతున్న విషయం. వందల కోట్ల ఏళ్ల పరిణామ క్రమం వల్ల ఆ జీవికి కచ్చితంగా ఉపయోగకరంగా ఉండే ప్రొటీన్లను తయారు చేసుకోగల శక్తి ఏర్పడింది. కరోనా వైరస్‌ విషయానికి వచ్చేసరికి ఈ మార్పులు అకస్మాత్తుగా చోటు చేసుకున్నవి కాబట్టి అవి వాటికి మేలు చేసేవిగా ఉండవని నిపుణుల అంచనా. పైగా ప్రతి జీవిలోనూ జన్యు క్రమంలో ఏర్పడే మార్పులను సరిదిద్దేందుకు ఒక వ్యవస్థ ఉంటుందన్నది మనం మరిచిపోకూడదని ఇది మనిషికీ, వైరస్‌కూ వర్తిస్తుందని వివరించారు. వైరస్‌ ఉత్పత్తి చేసే ప్రొటీన్లలో ఏదైనా తేడా వస్తే ఈ వ్యవస్థ వెంటనే రంగంలోకి దిగి ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తుందన్న మాట.     
 

Poll
Loading...
మరిన్ని వార్తలు