వేల ఏళ్ల క్రితమే కరోనా కజిన్‌ సిస్టర్‌!

10 May, 2021 03:13 IST|Sakshi

కరోనా.. ఈ పేరు వింటేనే వణుకు పుడుతున్న సమయమిది. దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన ఈ మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. నిజానికి కరోనా వైరస్‌ ఇప్పటిదేనా అంటే.. కాదట.. సుమారు 25 వేల ఏళ్ల ముందే కరోనాను పోలిన వైరస్‌ మనుషులకు సోకిందట. ఇప్పుడు అప్పుడూ అని కాదు.. మనుషులు తొలినాళ్ల నుంచీ ప్రమాదకర వైరస్‌లను ఎదుర్కొంటూనే ఉన్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలా వైరస్‌లను ఎదుర్కొన్నప్పటి సామర్థ్యం జన్యువుల రూపంలో తర్వాతి తరాలకు అందిందని.. అందుకే కొత్త కొత్త వైరస్‌లు వచ్చినా తట్టుకోగలుగుతున్నారని అంటున్నారు. ఈ అంశంపై ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఎనార్డ్‌ ఆధ్వర్యంలో అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి.. ఇటీవలే నివేదిక విడుదల చేశారు.  

మానవులు సమాజంగా ఏర్పడి జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన వైరస్‌ దాడికి గురవుతూనే ఉన్నారు. అలా వైరస్‌లు విజృంభించినప్పుడల్లా కొందరు వాటిని తట్టుకుని జీవించగలిగారు. అలాంటి వారిలో వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యానికి కారణమైన జన్యువులు తర్వాతి తరాలకు అందుతూ, మరింతగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ క్రమంలో వేల ఏళ్ల కిందటి ఆయా వైరస్‌ల జాడలు డీఎన్‌ఏలో ఉండిపోతాయి. వాటిని పరిశీలించడం ద్వారా అప్పటి పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు కరోనా వైరస్‌కు సంబంధించి.. ప్రపంచవ్యాప్తంగా 26 ప్రాంతాల నుంచి 2,504 మంది జన్యుక్రమంపై అరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. 
 
అప్పటి వైరస్‌తోనే తూర్పు ఆసియాలో.. 
మనుషుల్లో కొన్ని వేల రకాల ప్రొటీన్లు ఉంటాయి. మన శరీరంలోకి ప్రవేశించిన కరోనా ఇలాంటి కొన్ని ప్రొటీన్లను ఆధారం చేసుకునే.. కణాల్లో ప్రవేశించి, తన సంతతిని పెంచుకుంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌కు, శరీర కణాలకు మధ్య 420 రకాల ప్రొటీన్లు కీలకమని.. అందులో 332 ప్రొటీన్లు కరోనాకు అనుకూలంగా ఉండగా, మిగతావి వైరస్‌ను ఎదుర్కోవడంలో కణాలకు సాయం చేస్తాయని గుర్తించారు. ఇలా కరోనాను ఎదుర్కొనే ప్రొటీన్లు, వాటి ఉత్పత్తి కారణమయ్యే జన్యువులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ప్రొటీన్లు ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఉండగా.. తూర్పు ఆసియా దేశాలకు చెందినవారిలో మరింత సమర్థవంతంగా ఉన్నట్టు తేల్చారు. ఈ ప్రొటీన్లు ఇలా సమర్థవంతంగా మారడానికి కొన్ని జన్యుమార్పులు కారణమని.. సుమారు 25 వేల ఏళ్ల కిందటే ఈ మార్పులు మొదలయ్యాయని గుర్తించారు. అంటే అప్పటి నుంచే కరోనాను పోలిన వైరస్‌లు తూర్పు ఆసియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయని, అందుకే అక్కడి వారిలో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడి ఉంటుందని అంటున్నారు. 

ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు..! 
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా.. వైరస్‌ల వల్లనే వైరస్‌లను ఎదుర్కొని నిలిచే శక్తి మనుషులకు వచ్చిందని డేవిడ్‌ ఎనార్డ్‌ చెప్పారు. ‘‘వేల ఏళ్లనాడు వైరస్‌లను తట్టుకుని జీవించగలిగిన వారు.. తర్వాతి తరాలకు మూలంగా నిలిచారు. వారిలోని సమర్థవంతమైన జన్యువులు తర్వాతి తరాలకు సంక్రమించాయి. ఇలా క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా మనుషుల్లో పరిణామం రావడానికి అప్పటి వైరస్‌లే ప్రధాన కారణం’’అని వివరించారు. ఇప్పుడు తాము చేసిన పరిశోధన కరోనా వంటి మహమ్మారులు విజృంభిస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానికి మార్గనిర్దేశం చేయగలదని తెలిపారు.  

తూర్పు ఆసియా అంటే..? 
ఆసియా ఖండంలోని చైనా, జపాన్, మంగోలియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్‌ దేశాలను తూర్పు ఆసియా దేశాలుగా పేర్కొంటారు. ఇక వాటికి సమీపంగా ఉన్న దేశాలను చూస్తే నేపాల్, భూటాన్, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ దేశాలు ఉంటాయి. అరిజోనా వర్సిటీ నివేదిక ప్రకారం.. తూర్పు ఆసియా దేశాల వారికి కరోనా సోకినా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల పలు దేశాల్లోనూ వైరస్‌ను ఎదుర్కొనే శక్తి కొంత వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు