ఆదిలాబాద్‌లో విషాదం: అనారోగ్యంతో ఆర్మీ జవాన్‌ మృతి

28 Jun, 2021 08:00 IST|Sakshi
నవీన్‌(ఫైల్‌)

సాక్షి, తాంసి(ఆదిలాబాద్‌): ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ దాసరి నవీన్‌ (26) అనారోగ్యంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లక్నో ఆర్మీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన నవీన్‌ ఉత్తరప్రదేశ్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెల క్రితం సెలవులపై స్వగ్రామమైన పొన్నారికి వచ్చి, తిరిగి ఈనెల 2న లక్నో వెళ్లిపోయాడు. స్వగ్రామం నుంచి బయల్దేరే సమయంలోనే నవీన్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విధుల్లో చేరిన కొన్ని రోజులకే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆర్మీ అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు.

15 రోజులుగా చికిత్స పొందుతున్న నవీన్‌ పరిస్థితి విషమించి, ఆదివారం ఉదయం మృతి చెందినట్లు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు దాసరి స్వామి–సువర్ణ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తూ అందరితో కలివిడిగా ఉండే నవీన్‌ ఆకస్మిక మరణంతో పొన్నారి గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.  
చదవండి: ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు