ఎమ్మెల్యే అండతో నా ఇల్లు కబ్జా చేశారు!

24 May, 2022 02:36 IST|Sakshi
కలెక్టరేట్‌కు జాతీయ జెండాతో వచ్చిన అక్రమ్‌ 

ఆర్మీ జవాన్‌ ఆవేదన 

ఆదిలాబాద్‌ అర్బన్‌: దేశం కోసం ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న ఓ సైనికుడి ఇంటినే కబ్జాదారులు ఆక్రమించారు. దీంతో ఆ సైనికుడు న్యా యం కావాలంటూ జాతీయ జెండా చేతపట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు చెందిన మహమ్మద్‌ అక్రమ్‌ అర్మీ జవాన్‌. ఇచ్చోడలోని ఇస్లాంపూర్‌ కాలనీలో ఆయనకు ఓ ఇల్లు ఉంది.

ప్రస్తుతం అతని కుటుంబం బోథ్‌లో ఉంటోంది. కశ్మీర్‌లోని పుల్వామాలో విధులు నిర్వహిస్తున్న అక్రమ్‌ చాలా రోజులుగా ఇచ్చోడకు రాలేదు. దీనిని గమనించిన యాకూబ్‌ ఖురేషీ అనే వ్యక్తి ఖాళీగా ఉన్న అక్రమ్‌ ఇంటిని కబ్జా చేశాడు. విషయం తెలుసుకున్న అక్రమ్‌ సోమవారం జాతీయ జెండా పట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ను కలసి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు సహకారంతో ఖురేషీ తన ఇంటిని కబ్జా చేశాడని, తనవద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఖురేషీతోపాటు ఆయనకు సహకరించిన వారిపై చర్య తీసుకోవాలని అక్రమ్‌ డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు