మహేష్‌ ప్రాణత్యాగానికి గర్వపడుతున్నాం: కుటుంబ సభ్యులు

10 Nov, 2020 17:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: ఉగ్రమూకల కాల్పుల్లో అమరుడైన షహీద్‌ మహేష్‌ పార్థివ దేహం మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొనుంది. మహేష్‌ పార్థివ దేహాన్ని స్వస్థలమైన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి తరలిచించేందుకు మంగళవారం ఆర్మీ అధికారులు ప్రత్యేక అంబులెన్స్‌ సిద్దం చేశారు. ఈ సందర్భంగా మహేష్‌ సోదరుడు మల్లేష్‌, మామయ్య జీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. మహేష్‌ మృతి వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. అనునిత్యం దేశ సేవకై పరితపించే మహేష్‌ భరతమాత కోసం ప్రాణత్యాగం చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్క యువకుడు కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని చెబుతూ యువకులకు ఆదర్శంగా నిలిచేవాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్‌ జవాన్‌ వీర మరణం)

ఏడాది క్రితమే మహేష్‌ వివాహం జరిగిందని అంతలోనే మహేష్‌ మృతి తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జమ్మూ కశ్మీర్‌లో మచిల్ సెక్టార్‌లో ఆదివారం రోజున ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లోవీరమరణం పొందిన ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మ‌హేష్‌(25) కూడా మ‌ర‌ణించాడు. మహేష​ మృతి వార్త తెలియగానే మహేష్‌ కటుంబ సభ్యులు, భార్య క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. 

మరిన్ని వార్తలు