రోడ్లపై రయ్‌.. రయ్‌..

12 Jul, 2022 02:13 IST|Sakshi

హైదరాబాద్‌లో కార్ల రేసింగ్‌కు ఏర్పాట్లు షురూ 

వచ్చే ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ–రేసింగ్‌ 

అతిపెద్ద స్పోర్ట్స్‌ ఈవెంట్‌ కోసం సర్కారు సన్నాహాలు 

మేనేజింగ్, ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 

మంత్రి కేటీఆర్, స్పెషల్‌ సీఎస్‌ నేతృత్వం  

హుస్సేన్‌సాగర్, సచివాలయం కాంప్లెక్స్‌ చుట్టూ రేసింగ్‌ ట్రాక్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కార్ల రేసింగ్‌ ఈవెంట్‌ ‘ఫార్ములా ఈ– రేసింగ్‌’(ఈ–ప్రిక్స్‌)కు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్‌ నగరం సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ–చాంపియన్‌షిప్‌ తొమ్మిదో సీజన్‌ (2022–23)లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన నగరంలో ఈ–రేసింగ్‌ (సింగిల్‌ సీట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు నిర్వహించే పోటీలు) జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేనేజింగ్, ఎగ్జిక్యూటివ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కె. తారక రామారావు చైర్మన్‌గా మేనేజింగ్‌ కమిటీని, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ (అర్వింద్‌కుమార్‌) చైర్మన్‌గా ఎగ్జిక్యూటివ్‌ కమిటీని నియమించారు. ఈ మేరకు సోమవారం అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా ‘ఈ–రేసింగ్‌’కు ఆతిథ్యం ఇస్తున్న తొలి నగరంగా హైదరాబాద్‌ రికార్డు సృష్టించనుంది. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ్‌ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్‌ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోయే రెండో అతి పెద్ద రేసింగ్‌ ఈవెంట్‌ ఇదే కావడం గమనార్హం.   

సర్క్యూట్లలో కాదు.. వీధుల్లో రోడ్లపైనే 
ఫార్ములా వన్‌ రేసులు ప్రత్యేకంగా నిర్మించిన పర్పస్‌ బిల్డ్‌ (తాత్కాలిక) సర్క్యూట్లలో జరుగుతాయి. అయితే ఫార్ములా ఈ–ప్రిక్స్‌ మాత్రం నగర వీధుల్లోని రోడ్లపైనే జరుగుతాయి. మోటార్‌ స్పోర్ట్‌ అభిమానులకు వినోదం పంచడంతో పాటు ఎలక్ట్రిక్‌ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ చుట్టూ నెక్లెస్‌ రోడ్డులో సచివాలయం కాంప్లెక్స్, లుంబినీ పార్కు మీదుగా ఏర్పాటు చేసిన 2.37 కిలోమీటర్ల ట్రాక్‌ మీద ఈ–రేసింగ్‌ సాగనుంది.  

భారత్‌ తరఫున బరిలో ‘మహీంద్రా’ 
విద్యుత్‌ కార్లతో జరిగే ఈ తొమ్మిదో సీజన్‌ రేసింగ్‌ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో ‘ఫార్ములా ఈ’సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ క్యాలెండర్‌ను గత జూన్‌ 29న ఎఫ్‌ఐఏ (ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి–ఎల్‌ ఆటోమొబైల్‌ ) వరల్డ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆమోదించింది. సుమారు పదేళ్ల క్రితం గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో నిర్వహించిన ఫార్ములా వన్‌ పోటీల ద్వారా ప్రపంచ మోటార్‌ స్పోర్ట్స్‌ మ్యాప్‌లోకి భారత్‌ ప్రవేశించింది. వచ్చే ఏడాది జరిగే ఈ–రేసింగ్‌ నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రేసింగ్‌కు ఆతిథ్యం ఇస్తున్న 13 నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ నిలిచింది. ఈ రేసింగ్‌లో భారత్‌ నుంచి మహీంద్రా కంపెనీకి చెందిన ‘మహీంద్ర రేసింగ్‌’జట్టు పోటీ పడుతోంది. 

మేనేజింగ్‌ కమిటీలో.. చైర్మన్‌గా మంత్రి కేటీఆర్,సభ్యులుగా మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా రేసింగ్‌ టీమ్‌ ప్రిన్సిపాల్, సీఈవో దిల్‌బాగ్‌ గిల్, ఏస్‌ అర్బన్‌ రేస్‌ ఏండీ అండ్‌ సీఈవో, ఎఫ్‌ఐఏ ప్రతినిధి, కమిటీ నిర్ణయించిన ముగ్గురు నిపుణులు లేదా బ్రాండ్‌ అంబాసిడర్లు, చైర్మన్‌ నిర్ణయం మేరకు ఇతర సభ్యుడు, మెంబర్‌ కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఉంటారు.    

ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో
చైర్మన్‌గా ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ), సభ్యులుగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, జాయింట్‌ సీపీ ట్రాఫిక్, ఏస్‌ అర్బన్‌ గ్రీన్‌కో గ్రూప్‌ ఎండీ, అర్బన్‌ రేస్‌ నుంచి ఇద్దరు ప్రతినిధులు, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ ప్రాజెక్టు డైరెక్టర్, ఎండీ, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్, హెచ్‌ఎండీఏ సీఈ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, ఆర్‌ అండ్‌ బీ, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, కలెక్టరేట్‌ తదితర విభాగా లకు చెందిన అధికారులు ఉంటారు.   

మరిన్ని వార్తలు