రాములోరి కల్యాణానికి వేళాయె...

9 Apr, 2022 02:29 IST|Sakshi
రామయ్య కల్యాణం సందర్భంగా భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో పందిళ్ల నిర్మాణం 

వేడుకకు సిద్ధమవుతున్న భద్రగిరి 

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసంత ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేక మహోత్సవం ఆలయం వద్ద ఉన్న మిథిలా స్టేడియంలో జరగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని భారీ స్థాయి లో జరిపేందుకు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రెండేళ్ల తర్వాత ఆరు బయట కల్యాణోత్స వం జరగనుండటంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. కాగా,  కల్యాణానికి  సీఎం కేసీఆర్‌ హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఒకవేళ సీఎం రాకపోతే ఆయన తరఫున కుటుంబసభ్యులు గానీ.. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని సమాచారం. అలాగే, జిల్లా ప్రజల తరఫున తాను స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. 

పోచంపల్లి పట్టువస్త్రాలు ప్రత్యేకం 
రామయ్య కల్యాణానికి ఈ ఏడాది తొలిసారిగా పోచంపల్లి చేనేత కార్మికులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సికింద్రాబాద్‌లోని గణేశ్‌ టెంపుల్‌ చైర్మన్‌ జయరాజు ఆధ్వర్యం లో శనివారం ఈ పట్టు వస్త్రాలను రామాలయ ఈఓ శివాజీకి అందచేయనున్నారు. అలాగే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన భక్త బృందం గోటితో వొలిచిన 3 క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించారు. అంతేకాకుండా సీవీఆర్‌ వస్త్ర దుకాణం వారు స్వామి వారి ముత్యాల కొనుగోలుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. 

11, 12 తేదీల్లో గవర్నర్‌ పర్యటన 
పాల్వంచ రూరల్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. శ్రీరామనవమి మరుసటి రోజు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారికి నిర్వహించే మహా పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరవడం ఆనవాయితీ. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో గవర్నర్, 11న భద్రాచలం చేరుకుంటారు. సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, పట్టాభిషేకంలో పాల్గొంటారు. 12న దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పర్యటిస్తారు. 

మరిన్ని వార్తలు