పడవతో గస్తీ.. లేక్‌ పోలీసింగ్‌ వ్యవస్థ

2 May, 2022 08:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల 17 ఏళ్ల ఓ ఇంటర్‌ విద్యార్థి కేబుల్‌ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దుర్గం చెరువు, కేబుల్‌ బ్రిడ్జిలపై లేక్‌ పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిసారిగా పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో దుర్గం చెరువులో పడవతో పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేశారు. కేబుల్‌ బ్రిడ్జి కింద వాచ్‌ టవర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పర్యాటక ప్రాంతాలపై దృష్టి.. 
కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఇంటికే పరిమితమైన పర్యాటకులు క్రమంగా బయటకు వస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే బదులు స్థానికంగా ఉన్న టూరిస్ట్‌ ప్లేస్‌లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో దుర్గం చెరువు, కేబుల్‌ బ్రిడ్జిలపై సందర్శకుల తాకిడి పెరిగింది. వారాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో మద్యం తాగడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి పోలీసుల దృష్టికి వచ్చాయి. దీంతో సందర్శకులకు భద్రతతో పాటూ అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా ఉండేందుకు పోలీసుల గస్తీని ఏర్పాటు చేశామని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.  

బ్రిడ్జిపై వాచ్‌ టవర్‌.. 
ఇప్పటికే దుర్గం చెరువు, కేబుల్‌ బ్రిడ్జి పరిసరాల్లో సైబరాబాద్‌ పోలీసులు 67 కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా బ్రిడ్జి కింద పోలీసు వాచ్‌టవర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అన్ని సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏ మూలన ఏ సంఘటన కెమెరాల్లో నిక్షిప్తమవుతుంది. అనుమానిత వ్యక్తులు సంచరించినా, ట్రాఫిక్‌జాం, ఇతరత్రా ఇబ్బందులు జరిగినా వెంటనే వాచ్‌ టవర్‌లోని పోలీసులకు తెలిసిపోతుంది. వెంటనే క్షేత్ర స్థాయిలోని పోలీసులకు సమాచారం అందించి, ఘటన స్థలానికి వెళ్లి తగిన చర్యలు చేపడతారు. వాచ్‌ టవర్‌లో పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారు.  

లేక్‌ పోలీసులకు ఈవీ వాహనాలు.. 
దుర్గం చెరువు పరిసరాలలో ఆర్టిఫీషియల్‌ వాటర్‌ ఫాల్స్, రాక్‌ గార్డెన్, ట్రెక్కింగ్, రాక్‌ క్‌లైంబింగ్, ర్యాప్లింగ్, వాకింగ్‌ ట్రాక్‌ల వంటివి ఉన్నాయి. దీంతో పిల్లలు, యువకులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. కేబుల్‌ బ్రిడ్జి రోడ్డు మధ్యలో నిలబడి సెల్ఫీలు తీసుకోవటం, వాహనాలకు అంతరాయం కలిగిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

వీటిని నియంత్రించేందుకు లేక్‌ పోలీసులు 24 గంటలు గస్తీ చేస్తుంటారు. ఎలక్ట్రిక్‌ వాహనాలతో లేక్‌ పోలీసులు పెట్రోలింగ్‌ విధులను నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాలలో మహిళలతో అసభ్యంకరంగా ప్రవర్తించే పోకిరీలను షీ టీమ్‌ పోలీసులు అక్కడిక్కడే అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పలుమార్లు ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తే జైలుకు పంపిస్తున్నారు.  

(చదవండి: నైట్‌ బజార్‌.. ఫుల్‌ హుషార్‌.)

మరిన్ని వార్తలు