ఫలించిన కల.. ఆఫీస్‌బాయ్‌ నుంచి.. ఏపీపీ స్థాయికి

10 Jan, 2022 11:53 IST|Sakshi
అర్ధ కుమార్‌

సాక్షి, రామగుండం(కరీంనగర్‌): అంతర్గాం మండలంలో మారుమూల గ్రామమైన రాయదండికి చెందిన యువకుడు పట్టుదలతో ముందుకెళ్లి అనుకున్నది సాధించాడు. ఆఫీస్‌బాయ్‌గా పనిచేసి అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఎంపికై పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. గ్రామానికి చెందిన అర్ధ చంద్రయ్య, వరలక్ష్మి దంపతుల రెండో కొడుకు కుమార్‌.

అబాది రామగుండం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదో తరగతి, గోదావరిఖనిలో ఇంటర్, డిగ్రీ చదివాడు. ఖర్చుల కోసం ప్రైవేటు పాఠశాలలో పార్ట్‌టైం ఉపాధ్యాయుడిగా, పేపర్‌ బాయ్‌గా, కార్యాలయాల్లో గుమాస్తాగా పనిచేశాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ సీటు సాధించాడు. 2004 నుంచి గోదావరిఖని, హైదరాబాద్‌లో సీనియర్‌ న్యాయవాదుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. 

సహకరించిన అర్ధాంగి
కుమార్‌కు పెద్దంపేటకు చెందిన తోట రాంచందర్, భాగ్య కూతురు రజితతో 2008లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. ఎంఎస్సీ పూర్తిచేసిన రజిత 2014లో వీఆర్‌ఏగా అదే గ్రామంలో ఉద్యోగం సాధించింది. అప్పటినుంచి కుమార్‌ను ప్రోత్సహిస్తోంది.

ఆమె సహకారంతో 2021 అక్టోబర్‌లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రవేశ పరీక్ష రాశాడు కుమార్‌. నవంబర్‌లో వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్‌ పీపీగా ఎంపికైనట్లు ఉత్తుర్వులు వెలువడ్డాయి. దీంతో అతడి కుటుంబంలో ఆనందం నెలకొంది. 

పట్టుదలతోనే ముందుకు..
ఏపీపీ ప్రవేశ పరీక్షకు ముందు అనేక జర్నల్స్‌ చదివా. విజయ శిఖరాలకు చేరినవారిని ఆదర్శంగా తీసుకున్నా. ప్రతిరోజూ 8 గంటలపాటు చదివా. న్యాయవాది వృత్తిలో కొనసాగాలనేది నా కల. పేదలకు సేవ చేయాలన్న తలంపుతోనే ఈ వృత్తిలోకి వచ్చా.            

– అర్ధ కుమార్‌ 

చదవండి: ‘రెండు గుంటలు’.. రెండు హత్యలు

     
 

మరిన్ని వార్తలు