ఫ్లిప్‌కార్ట్‌లో నారాయణపేట హస్తకళాకృతులు

10 May, 2022 02:44 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో  ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం 

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆరుణ్య ప్రాజెక్టుతో ఒప్పందం 

జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌తో మహిళలకు ప్రయోజనం: కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నారాయణపేట స్వయం సహాయక సంఘాల మహిళలు, చేతివృత్తులు, చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులు ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా దేశమంతటా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నారాయణపేటకు చెందిన ఆరుణ్య ప్రాజెక్టుతో ఫ్లిప్‌కార్ట్‌ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ‘టర్మ్స్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌’పై మంత్రి కేటీఆర్‌ సమక్షంలో సంతకాలు జరిగాయి.

ఈ ఒప్పందంలో భాగంగా మహిళా చేతివృత్తులు, చేనేతకారులకు తరగతుల నిర్వహణ, క్షేత్రస్థాయి శిక్షణను అందించి.. వారు తయారుచేసే ఉత్పత్తులకు జాతీయస్థాయి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలోని చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సమ్మిళిత అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మహిళల జీవనోపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం వంటివి తోడ్పడుతాయి’’అన్నారు.

తెలంగాణ, ఆరుణ్యలతో భాగస్వామ్యం కావడం సంతోషకరమని.. మహిళలకు ఆర్థిక స్వా తంత్య్రం అందించడం, వారి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మార్కెటింగ్‌ అందించడం తమకు ఆనందాన్ని ఇస్తోందని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ చీఫ్‌ కార్పొరేట్‌ సంబంధాల అధికారి రజనీష్‌కుమార్‌ చెప్పారు. 

ఏమిటీ ఆరుణ్య? 
నారాయణపేటలో చేనేత, హస్తకళాకృతులకు ‘ఆరుణ్య’ ప్రసిద్ధమైన బ్రాండ్‌. కరోనా కాలంలో స్థానిక మహిళలకు ఉపాధి, వారు చేసే ప్రత్యేక ఉత్పత్తుల విక్రయం ద్వారా సాయపడేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మొదట పది మందితో మొదలై.. ఇప్పుడు కలంకారీ, బ్లాక్‌ పెయింటింగ్‌ అంశాల్లో మహిళలకు శిక్షణనిచ్చే స్థాయికి చేరుకుంది.  

మరిన్ని వార్తలు