సచివాలయ కూల్చివేతపై సుప్రీం మరోసారి విచారణ

15 Oct, 2020 17:27 IST|Sakshi

ఢిల్లీ : తెలంగాణ సచివాలయం కూల్చివేత పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డె నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణం లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం కూల్చివేతను అర్దరాత్రి చేపట్టారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కొత్త సచివాలయం కోసం కూల్చివేత చేపట్టారు కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం అని పిటిషన్‌లో తెలిపారు. తాజగా గురువారం కేసు విచారణ సందర్భంగా సచివాలయం నిర్మాణాల కూల్చివేత పూర్తయిందా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పులో అభ్యంతరం ఏముందని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్‌ను ప్రశ్నించారు. (చదవండి : తెలంగాణ వర్షాలపై స్పందించిన యూవీ)

దీనికి సమాధానంగా సచివాలయం కూల్చివేత అనేది నూతన సచివాలయం నిర్మాణానికి సన్నద్దం చేయడమా కాదా అన్నది తేల్చాల్సి ఉందని  శ్రావణ్ కుమార్ వివరించారు. అయితే కేసు విచారణ యోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అన్నారు. తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చునని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పటికే తీర్పు ఇచ్చినందు వల్ల రేవంత్ రెడ్డి పిటిషన్ తిరస్కరించాలని తుషార్‌ మెహతా వెల్లడించారు.

సచివాలయం అంశంపై గతంలో జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ విచారణ జరపడంతో.. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అదే బెంచ్ కు బదిలీ చేస్తామని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ ప్రతిపాదనను తుషార్‌ మెహతా వ్యతిరేకించారు. కేసు విచారణ యోగ్యమైనది కాదు కాబట్టి బదిలీ అవసరంలేదని వాదించారు. దీనికి అంగీకరించని చీఫ్ జస్టిస్ బెంచ్ రేవంత్ రెడ్డి కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 26న జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు