వచ్చే ఎన్నికల్లో ఎక్కువచోట్ల పోటీ

13 Mar, 2022 02:01 IST|Sakshi

కష్టపడ్డ వారికే ఫలితం ఉంటుందని యూపీ నిరూపించింది: అసదుద్దీన్‌  

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆజాద్‌ను నిలిపినా బీజేపీ తమకు శత్రువేనని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం తమకున్న స్థానాల కంటే ఎక్కువ చోట్ల పోటీచేసే అవకాశముందని మజ్లిస్‌ (ఏఐఎంఐఎం) పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల వస్తాయా అన్నదానిపై తనకు సమాచారం లేదని చెప్పారు. శనివారం అసెంబ్లీ వద్దకు వచ్చిన అసదుద్దీన్‌ అక్కడ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. యూపీ, ఇతర రాష్ట్రాల్లో విజయాల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచే ఆలోచనలో ఉందని మీడియా ప్రస్తావించగా.. ఇక్కడ చురుకైన ముఖ్యమంత్రి ఉన్నారని అసద్‌ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ ఎలాంటి పాత్ర పోషిస్తారో తమకు తెలియదని, ఫ్రంట్‌లో తాము ఎలాంటి పాత్ర పోషిస్తామో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఒంటరిగా తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేయలేమని, ఆయన మొండి మనిషి అని ప్రశంసించారు.

కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాలేదు 
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఏడాది మొత్తం కష్టపడిన వారికే ఫలితం ఉంటుందని నిరూపణ అయిందని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. తాము ఇప్పుడు ఓడించడమే దశలో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరుకుంటామని చెప్పారు. గుజరాత్, రాజస్థాన్‌ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. జాతీయస్థాయిలో బీజేపీకి కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాలేకపోతోందని.. కాంగ్రెస్‌ వైఫల్యంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను ప్రాంతీయ పార్టీలు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజేడీ పార్టీలు కీలకమన్నారు. బీజేపీ గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపినా.. ఆ పార్టీని శత్రువుగానే చూస్తామన్నారు.   

మరిన్ని వార్తలు