రక్తం నోటితో పీల్చాలా?

30 Jul, 2022 07:37 IST|Sakshi
రక్తాన్ని నోటి ద్వారా పీలుస్తున్న ఆశ కార్యకర్త

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా మారింది.. ఆశ (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌–ఏఎస్‌హెచ్‌ఏ) కార్యకర్తల పరిస్థితి. చాలీచాలని వేతనాలతో గ్రామస్థాయిలో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశా కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అయ్యేలా చూడటం, పిల్లలకు టీకాలు వేయించడం తద్వారా మాతాశిశు మరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఆశ వర్కర్ల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులోనూ వీరి సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారికి కనీస భద్రతా సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. ప్రస్తుతం హిమోగ్లోబిన్‌ పరీక్ష,  క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల నుంచి శాంపిల్స్‌ సేకరించే క్రమంలో తామెక్కడ వ్యాధుల బారిన పడతామోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇవి ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి నిపుణులతో చేయించాలి్సన పనులను తూతూ మంత్రంగా శిక్షణ ఇప్పించి.. తమతో చేయించడం అన్యాయమని వాపోతున్నారు.

20 తెమడ శాంపిళ్లు మోసుకురావాలా?
ఇదే క్రమంలో వీరికి అప్పగించిన మరో పని టీబీ నిర్ధారణ. గతంలో రెండువారాల పాటు రాత్రిళ్లు జ్వరంతో బాధపడుతూ.. నిర్విరామంగా దగ్గుతూ, బరువు తగ్గిన వారికి మాత్రమే ఉదయంపూట ఆశ కార్యకర్తలు తెమడ సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపేవారు.

► ఈ క్రమంలో వీరిలో నూటికి 99 శాతం పాజిటివ్‌ రేటు ఉండేది. కానీ, ప్రస్తుతం జిల్లా వైద్యాధికారులు టీబీ పరీక్షల శాంపిల్స్‌ సేకరణలో టార్గెట్‌ విధించారు. ప్రతీ సబ్‌సెంటర్‌కు ముగ్గురు లేదా నలుగురు (వెయ్యిమందికి ఒక ఆశ) కార్యకర్తలు ఉంటారు.
► వీరు తలా 20 తెమడ పరీక్షలు తేవాలని లక్ష్యం విధించారు. ఆ స్థాయిలో అనుమానిత కేసులు లేవని ఆశ కార్యకర్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా.. అధికారులు మాత్రం ససేమీరా     అంటున్నారు. నెలనెలా నిర్వహించే రివ్యూ మీటింగుల్లో ఆశ కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి     తీసుకువస్తున్నారు.
► ఈ క్రమంలో తెమడ శాంపిల్స్‌ ఉన్న డబ్బాలను తాము చేతులతో మోసుకుపోతున్నామని, వీటిని పట్టుకుని బస్సు, ఆటో ఏది ఎక్కినా.. భయంతో తోటి ప్రయాణికులు కిందకు దించేస్తున్నారని వాపోతున్నారు.
► వాస్తవానికి హిమోగ్లోబిన్, తెమడ పరీక్షలు     రెండూ ఆశలకు కేటాయించిన విధులు కావు. వీటికి ప్రత్యేకంగా టీఏ, డీఏలు ఏమీ రావు. అయినా, వీరు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ పనులు చేస్తున్నారు. 
► క్షయ అంటువ్యాధి అని, సరైన రక్షణ లేకుండా రోగి వద్దకు వెళ్లినా, ఏమరుపాటుగా ఉన్నా.. తాము రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులతో భోజనం చేయలేకపోతున్నామని, తమతో కుటుంబ స భ్యులు ఏం వ్యాధులు సంక్రమిస్తాయో అని నిత్యం భయపడుతున్నారని అంటున్నారు.

రక్తం నోటితో పీల్చాలా?
► ఫీవర్‌ సర్వే కోసం ఆశ కార్యకర్తలు ఇల్లిళ్లూ తిరిగి హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రతీ ఆశకు వైద్యాధికారులు ఒక కిట్‌ ఇచ్చారు. దానిసాయంతో జ్వరంతో బాధపడుతున్న వారికి హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించాలి.
► కిట్‌లో డీఅయోనైజ్డ్‌ వాటర్, హైడ్రో క్లోరిక్‌ యాసిడ్‌ (హెచ్‌సీఎల్‌), పరీక్షనాళిక, హి మోగ్లోబినో మీటర్, పిప్పెట్, సూదులు, కాటన్‌ తదితరాలు ఉంటాయి. ఇందులో సూది సాయంతో రోగి వేలిపై పొడిచి ఆ రక్తాన్ని నేరుగా పిప్పిట్‌లోకి 20 మైక్రోలీటర్‌ మార్కు వచ్చేంత వరకు నోటితో పీల్చాలి. 
► తరువాత ఈ రక్తాన్ని అంతే ఓపికతో హెచ్‌సీఎల్‌ కలిపిన ట్యూబ్‌లో నోటితో ఊదుతూ వదలాలి. దానికి డీ అయోనైజ్డ్‌ వాటర్‌ కలుపుతూ హిమోగ్లోబిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, ఇక్కడే ఆశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
► రోగి రక్తాన్ని పిప్పెట్‌లోకి ఎక్కించే క్రమంలో ఆ రక్తం నోటిలోకి వెళితే? అన్న ఆందోళన వీరిని వెంటాడుతోంది. ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో? అవి తమకు ఎక్కడ సంక్రమిస్తాయో అని భయపడుతున్నారు. రెక్కాడితే గానీ, డొక్కాడని పేద బతుకులు తమవని, అలాంటి తమకు ఇలాంటి పనులు చెప్పడం తగదని అంటున్నారు.

మా బతుకులకు రక్షణ ఏది
వాస్తవానికి టీబీ, హిమోగ్లోబిన్‌  పరీక్షలు చేసే క్రమంలో ఎలాంటి రక్షణను వైద్యాధికారులు కల్పించడం లేదు. కనీసం అవసరాలైన మా స్కు, శానిటైజర్, గ్లోవ్స్, కళ్లద్దాలు లాంటి కనీస సదుపాయాలు లేవు. దీంతో ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడతామోనని భయంభయంగా విధులు నిర్వహిస్తున్నాం. రక్తం నోట్లోకి వెళితే ఎలా? టీబీ అనుమానితుడి తెమడ ద్వారా వ్యాధి సంక్రమిస్తే ఎలా? అన్న భయంతో.. బిక్కుబిక్కుమంటూ విధులు ని ర్వహిస్తున్నాం. మా బతుకులకు రక్షణ లేదు. 
– మారెళ్ల శ్రీలత, ఆశా యూనియన్‌ 
కరీంనగర్‌ జిల్లా ప్రధానకార్యదర్శి  

మరిన్ని వార్తలు