ట్రిపుల్‌ ఆర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌ 

5 Mar, 2022 02:14 IST|Sakshi
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు పుష్ప గుచ్ఛం ఇస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో బండి సంజయ్‌

ప్రతిపాదనలు తీసుకొస్తే పరిశీలిస్తామని రైల్వేమంత్రి హామీ 

దేశంలోనే నంబర్‌ వన్‌ ప్రాజెక్టు అవుతుందని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రీజినల్‌ రింగ్‌రోడ్డు(ట్రిపుల్‌ ఆర్‌) ప్రాజెక్ట్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌ రైలు మార్గాన్ని వేయగలిగితే అది దేశంలోనే నంబర్‌ వన్‌ ప్రాజెక్ట్‌గా మారుతుందని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అభిప్రాయపడ్డారు. సవివరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకొస్తే రైల్వే అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తాను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కలసి ప్రధాని నరేంద్రమోదీ వద్ద దీనిపై చర్చిస్తామని చెప్పారు.

ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్ట్‌ అయినందున ఇప్పటికిప్పుడు దానిపై ప్రకటన సాధ్యంకాదని స్పష్టం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతల సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆలోచన బాగుందని బండి సంజయ్, సీహెచ్‌ విఠల్‌ తదితర నేతలు పేర్కొన్నారు.

రైల్వేమంత్రి స్పందించి ట్రిపుల్‌ ఆర్‌ వెడల్పు ఎంతని అడగగా వంద మీటర్లని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బదులిచ్చారు. వంద మీటర్లలో రైల్వేశాఖకు 30 మీటర్లు కేటాయిస్తే ట్రిపుల్‌ ఆర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’అని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, డా.జి.మనోహర్‌రెడ్డి, కొల్లి మాధవి, జయశ్రీ, గూడూరు నారాయణరెడ్డి, రాకేశ్‌రెడ్డి, సంగప్ప పాల్గొన్నారు. 

రాష్ట్రవాటా చెల్లించడంలేదు.. 
హైదరాబాద్‌లోని మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌(ఎంఎంటీఎస్‌) పూర్తి చేయడానికి కేంద్రం మూడొంతుల నిధులు చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించడంలేదని రైల్వే మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూయూపీఏ హయాంలో రైల్వేకు సంబంధించి 2009–14 మధ్యలో ఉమ్మడి ఏపీకి ఏడాదికి రూ.886 కోట్లు కేటాయించగా, మోదీ ప్రభుత్వం 2014–19 మధ్యలో ఒక్క తెలంగాణకే ఏడాదికి రూ.1,110 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

2019లో రూ.2,056 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.3,048 కోట్లకు పెంచినట్లు తెలిపారు. 2009–14 మధ్యలో తెలంగాణలో ట్రాక్‌ డబ్లింగ్, ఇతర పనులు శూన్యంకాగా ఇప్పుడు 24 కి.మీ. మేర ఈ పనులు సాగుతున్నాయని, ఈ ఏడాది అవి రెట్టింపు కాబోతున్నాయని చెప్పారు.   

మరిన్ని వార్తలు