దివంగత సీఎం వైఎస్‌ది గోల్డెన్‌ పీరియడ్‌: చాడ

30 Oct, 2022 00:52 IST|Sakshi
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న చాడ వెంకట్‌రెడ్డి 

హుస్నాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం గోల్డెన్‌ పీరియడ్‌ అని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ కాలంలో తాను సీపీఐ శాసన సభాపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చించేందుకు ఎక్కువ అవకాశం కలిగిందని, స్ఫూర్తిదాయక చర్చ జరిగేదని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రాజ్యలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో శనివారం చాడ వెంకట్‌రెడ్డి రచించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం.. శాసనసభ ప్రసంగాలు’ అనే పుస్తకావిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అసోసియేషన్‌ అధ్యక్షుడు పందిల్ల శంకర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ హుస్నాబాద్‌ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహించానన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్‌లో జరిగిన లాకప్‌డెత్‌పై అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. వైఎస్‌ మానవత్వం ఉన్న నాయకుడని, ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు పార్టీ వేరైనా పరిష్కరించేవారన్నారు.

నాటి ప్రతిపక్షాలు ప్రజల గొంతుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారని నేడు అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొనే పరిస్ధితి వచ్చిందని, ఇప్పుడు ప్రజాస్వామ్యం అమ్ముడుపోయిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌చైర్మన్‌ అనిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు