బీజేపీలో భూ రగడ.. రాష్ట్ర అధిష్టానం దృష్టికి సమస్య

29 Apr, 2022 17:43 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బీజేపీలో భూ రగడ వివాదాస్పదమవుతోంది.. ఆ పార్టీకి చెందిన జిల్లా ముఖ్య నాయకుల ప్రమేయంపై ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు గుర్రుగా ఉన్నారు. మంగళవారం రాత్రి ఈ వివాదం విషయమై ఎంపీని కలిసేందుకు వెళ్లిన కొంతమంది ముఖ్య నాయకులను ఎంపీ గన్‌మెన్‌లు ఆ సమయంలో కలిసేందుకు అనుమతినివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వారు గన్‌మెన్‌లను నెట్టివేశారు. వారు మావల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డిపై కేసు నమోదైంది. అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడం సంచలనం కలిగిస్తుంది. అయితే గన్‌మెన్‌లను నెట్టివేసిన తీవ్రత కంటే భూ రగడ విషయంలోనే కేసు తీవ్రతకు కారణమైందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ సోయం బాపురావుకు, పార్టీ జిల్లా ముఖ్య నాయకుల మధ్య వివాదం బీజేపీలో చర్చనీయంగా మారింది.

రాష్ట్ర అధిష్టానం దృష్టికి..
అసైన్డ్‌ భూమి విషయంలో జిల్లా నేతల ప్రమేయం, దాని విషయంలో ఎంపీ నివాస గృహం వద్ద దురుసు ప్రవర్తన వంటి విషయాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎంపీ ఇంటి వద్ద జరిగిన వివాదంలో పలువురు బీజేపీ జిల్లా నేతలు ఉన్నప్పటికీ ఈ విషయంలో పార్టీ పరువును దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కేసు నుంచి తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జిల్లా అధికార ప్రతినిధిపై మాత్రం అట్రాసిటీ కేసు నమోదైంది.  

కనిపించని సందడి..
ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు పుట్టిన రోజు గురువారం కాగా,  ఆ సందడి ఆదిలాబాద్‌ పట్టణంలో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఆయన అత్యవసర పని నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఎంపీ క్యాంప్‌ ఆఫీస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే పట్టణంలో ఎక్కడ కూడా ఎంపీ సోయం బాపురావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమివ్వలేదు. బీజేపీలో ఏ కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీల సందడి కనిపిస్తుంది. అలాంటిది ఎంపీ బర్త్‌ డే సందర్భంగా సందడి కనిపించకపోవడంపైనా చర్చ సాగుతోంది. 

అసైన్డ్‌ భూమి విషయంలో..
ఇచ్చోడ మండలం బాబుల్‌డోవ్‌ గ్రామ శివారులో ఎనిమిది ఎకరాల అసైన్డ్‌ భూమి విషయంలోనే ఈ వివాదం చోటుచేసుకుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ జిల్లా ముఖ్య నాయకుడు, అతని బంధువులు ఈ భూమిని కొనుగోలు చేసేందుకు గతేడాది సెప్టెంబర్‌లో నలుగురు అసైన్డ్‌దారులతో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. డబ్బుల విషయంలో వివాదం, ఆ నలుగురి కుటుంబాలను సదరు నేతలు వేధంచడంతో బాధితులు ఓ వ్యక్తి ద్వారా ఎంపీ సోయం బాపురావును కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలోనే మంగళవారం రాత్రి ఎంపీ సోయం బాపురావు తన నివాస గృహంలో ఉన్నప్పుడు అసైన్డ్‌దారుల తరపు వ్యక్తి మాట్లాడేందుకు రాగా, ఈ విషయం తెలుసుకుని జిల్లా బీజేపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీ సూచన మేరకు బీజేపీ నాయకులను గన్‌మెన్‌లు మరుసటి రోజు ఉదయం రమ్మని చెబుతున్నా దురుసుగా ఇంట్లోకి ప్రవేశించడం, ఆ క్రమంలో గన్‌మెన్‌లను నెట్టివేయడం జరిగిందనే ప్రచారం జరుగుతోంది.

చదవండి: సీఐతో శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ 

మరిన్ని వార్తలు