ఆపేశారా.. అడ్డుకున్నారా?

26 Apr, 2022 09:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘకాలంగా జీహెచ్‌ఎంసీలో పాతుకుపోయి.. అవినీతి ఆరోపణల్లో  కూరుకుపోయిన సహాయ వైద్యాధికారులను (ఏఎంఓహెచ్‌) వారి మాతృ సంస్థలకు పంపేందుకు సిద్ధమైన  ఉన్నతాధికారులు 12 మందిని  సాగనంపేందుకు రంగం సిద్ధం చేశారు. ఏడుగురికి రిలీవ్‌ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. మిగతా అయిదుగురిని సైతం నేడో, రేపో పంపించనున్నట్లు సంకేతాలు వెలువడినప్పటికీ వారిని పంపించలేదు. దాదాపు నెల రోజులైనా వారినింకా కదల్చలేదు.

వారి స్థానాల్లో వారు విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏడుగురిని పంపించడానికి అంతకుముందు సైతం అధికారులు తాత్సారం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో.. డిప్యుటేషన్‌ గడువు ముగిసిపోయినప్పటికీ కొ నసాగుతున్న వారిని మాతృసంస్థకు సరెండర్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ నుంచి రిలీవ్‌ చేశారు.  మరో అయిదుగురిని ఇంకా  ఎందుకు పంపించలేదన్నది జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం  హాట్‌ టాపిక్‌గా మారింది. 

అవినీతి ప్రక్షాళన కానుందని భావించినా.. 
అవినీతిలో మునిగిన ఆరోగ్య, పారిశుద్ధ్య విభాగం ప్రక్షాళన కానుందని భావించినప్పటికీ బ్రేక్‌ పడింది. అత్యంత ఉన్నతస్థాయిలోని, రాజకీయ పైరవీలతోనే ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడినట్లు భావిస్తున్నారు. తగిన అండదండలుంటే జీహెచ్‌ఎంసీలో ఎంత అవినీతి చేసిన వారినైనా కొనసాగించడం, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినా చర్యలు ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

పారిశుద్ధ్య, ఎంటమాలజీ విభాగాల్లో కొందరు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరణించిన, పనిచేయలేని వారి స్థానంలో కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉద్యోగాలకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. చేతులు తడపని వారిని సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని జీహెచ్‌ఎంసీలోని యూనియన్‌ నాయకుడు అల్వాల్‌ శివకుమార్‌ పేర్కొన్నారు. 

(చదవండి: లగ్జరీ కార్లే టార్గెట్‌! విమానంలో వస్తాడు... దొంగిలించిన కారులో జారుకుంటాడు)

మరిన్ని వార్తలు