జగన్‌ మరోసారి సీఎం కావడం ఖాయం

2 Apr, 2022 03:54 IST|Sakshi

ఆయన గ్రహస్థితులు మే నెల నుంచి మరింత పాజిటివ్‌గా మారుతున్నాయి 

చంద్రబాబు గ్రహస్థితులు రోజురోజుకూ నీరసించిపోతున్నాయి 

జ్యోతిష పండితుడు మాండ్రు నారాయణ రమణారావు సిద్ధాంతి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల స్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని, ఎన్ని పార్టీలు కలిసి పోటీచేసినా ఆయన ముందు చిత్తవుతాయని ప్రముఖ జ్యోతిష పండితుడు మాండ్రు నారాయణ రమణారావు సిద్ధాంతి జోస్యం చెప్పారు. ఏపీ సచివాలయంలో ప్రతికూల శక్తులు బలంగా పనిచేస్తున్నాయని, అక్కడ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితి గురించి ఉగాది సందర్భంగా నారాయణరావు సిద్ధాంతి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఎన్ని పార్టీలు కలిసినా జగన్‌ ముందు చిత్తే.. 
‘వైఎస్‌ జగన్‌ గ్రహాలు, నక్షత్రాలు శుభ బలంగా ఉన్నాయి. ఈ కారణం వల్లనే ఆయనపై ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా చిత్తవడం ఖాయం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గ్రహాలు కుజుడు, రవి, చం ద్రుడు, శని, శుక్ర గ్రహాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. దీనికితోడు ఛాయా గ్రహాలైన రాహు, కేతువులు, మే నెల నుంచి సానుకూల ప్రభావం చూపబోతున్నాయి. ఈ గ్రహాల అనుకూలత కారణంగా 120–150 సీట్లలో ఆయన గెలిచి మరోమారు అధికారం చేజిక్కించుకుంటారు. ఆయన తూర్పు ఆగ్నేయ స్థానంలో కూర్చుని పాలన చేస్తే రాజకీయంగా మరింత పట్టు వస్తుంది.

ప్రజల నుంచి కూడా మరింత ఆదరణ లభిస్తుంది. ఏపీ సెక్రటేరియట్‌ వాస్తు అధ్వానంగా ఉంది. ఈ సెక్రటేరియట్‌లో ప్రతికూల శక్తులు బలంగా ఉన్నాయి. ఈ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా ఇది ప్రభావాన్ని చూపుతుంది. ఇందులోని కొన్ని ముఖ్య భాగాలను మార్పు చేస్తే కోర్టు కేసులు, పెండింగ్‌ పనుల్లో కదలిక వస్తుంది. అసెంబ్లీ నిర్మాణంలో కూడా లోపం ఉంది. ఈ లోపాలను కూడా సవరించుకోవాలి. మూడు రాజధానుల పనుల్లో అప్పుడే కదలిక వస్తుంది. 

బాబు పరిస్థితి అగమ్యగోచరమే.. 
చంద్రబాబు నాయుడుకు చెందిన ముఖ్య గ్రహాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా రవి, శని, శుక్ర, చంద్ర గ్రహాలతోపాటు ఛాయా గ్రహాలైన రాహు, కేతువులు పూర్తిగా నీరసపడుతున్నాయి. ఈ గ్రహాల స్థితి ఇలాగే కొనసాగితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేనట్టే. గ్రహాలు బలంగా ఉన్నవారు చంద్రబాబుతో జట్టుకట్టినా వారి పరిస్థితి కూడా అగమ్యగోచరమే అవుతుంది. చంద్రబాబు గ్రహబలాలను బట్టి ఇప్పుడిప్పుడే ఆయనకు రాజకీయ యోగం లేదు. 

మోదీకి ఏమీ కాదు.. 
ప్రధాని మోదీ రవి, శుక్ర, శని, కుజ, చంద్ర గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈయనపై ఎంతటివారు నిలబడినా తట్టుకోలేరు. ఘోరంగా పరాజయం పాలవుతారు. కేంద్రంలో మళ్లీ మోదీ విజయకేతనం ఎగరవేయడం ఖాయం. ప్రధాని గ్రహాల పయనాన్ని బట్టి చూస్తే ఎవరు ఆయన్ను ఎంత విమర్శించినా ఆయనకేం కాదు.’   

మరిన్ని వార్తలు