16 ఏళ్లలో తొలిసారి: నెరవేరిన మహానేత కల

24 Aug, 2020 11:00 IST|Sakshi
నిండుకుండలా మారిన రిజర్వాయర్‌

సాక్షి, వరంగల్: ఇటీవల కురిసిన వర్షాలతో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లోకి వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన రిజర్వాయర్‌ నుంచి శనివారం మత్తడి దుంకింది. ఎడారి ప్రాంతంగా మారిన ఇక్కడి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 2004లో రిజర్వాయర్‌ పనులు ప్రారంభించారు. 0.74 టీఎంసీల సామర్ధ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌కు మూడు గేట్లు బిగించారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా మొత్తం 45,600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనేది లక్ష్యం. ఇందులో పంగిడి చెరువు పాత తూము ద్వారా 1,500 ఎకరాలు, గ్రావిటీ కెనాల్‌ ద్వారా చీటకోడూరు రిజర్వాయర్‌ కింద 4,100 ఎకరాలు, రైట్‌మెన్‌ కెనాల్‌ ద్వారా ఆలేరు కెనాల్‌ కాల్వ కింద 41వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2010లోనే రిజర్వాయర్‌ పనులు పూర్తికావడంతో గోదావరి జలాలను విడుదల చేశారు. ఏటా 8.6 కిలోమీటర్ల దూరంలోని చాగల్‌ పంపుహౌజ్‌ నుంచి అశ్వరావుపల్లి ఔట్‌పాల్‌ వరకు పంపింగ్‌ కొనసాగిస్తూ రఘునాథపల్లి, జనగామ మండలాల్లోని పలు గ్రామాల చెరువులు నింపుతున్నారు. 

మొదటి సారి..
అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ ప్రారంభమయ్యాక 16 ఏళ్లలో మత్తడి దుంకడం ఇదే మొదటి సారి. 877 ఎకరాల భారీ విస్తీర్ణంలో రిజర్వాయర్‌ ఉంది. వరద అంతకంతకు పెరగడంతో ఎగువన ఉన్న యాపలగడ్డతండా, చర్లతండా రహదారులు నీట మునిగాయి. రిజర్వాయర్‌ నిర్మాణ సమయంలో గుర్తించిన ఎస్‌టీఎల్, ఎఫ్‌టీఎల్‌ను దాటి రెండు తండాల్లో నీరు చేరింది. గతంలో భూసేకరణ అవరసం లేదని భావించిన పంట భూములు నీట మునగడంతో తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్‌ మత్తడి పడుతుండడంతో దిగువననున్న కంచనపల్లి, గబ్బెట గ్రామాల్లో వాగుకు ఇరువైపులా ఉన్న ప్రజలను అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తం చేసింది. ఇప్పటికే గబ్బెట గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.

అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ బన్సీలాల్, ఎస్సై కందుల అశోక్‌కుమార్, ఎంపీడీఓ హసీం, దేవాదుల డీఈ రాజు, ఏఈ శ్రీనివాస్‌లు రిజర్వాయర్‌ను సందర్శించి ప్రజలకు సూచనలు చేశారు. కాగా, వర్షాలు తగ్గడంతో వాగుకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రిజర్వాయర్‌ మత్తడి దుంకుతుండటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఎత్తయిన ప్రాంతం నుంచి అలుగు పారుతుండడాన్ని చూసి పులకించిపోతున్నారు. మహానేత వైఎస్సార్‌ చలవేనని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు