యువతిపై లైంగికదాడికి యత్నం

10 Aug, 2021 03:16 IST|Sakshi

ప్రతిఘటించడంతో బాధితురాలి నోట్లో పురుగుల మందు

యువకుడిపై దాడి చేసిన యువతి తండ్రి

తప్పించుకున్న నిందితుడు.. బాధితురాలికి తీవ్రగాయాలు

సాక్షి, పెద్దపల్లి: ఇంట్లో ఒంటరిగా కనిపించిన ఓ యువతిపై లైంగికదాడికి యత్నించాడో కామాంధుడు. ఆమె ప్రతిఘటించడంతో పురుగులమందు నోట్లో పోసి ఆమె ప్రాణాలు బలి తీసుకోబోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. మంథని సీఐ సతీశ్‌ కథనం ప్రకారం... బాధితురాలి తండ్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరేసరికి లోపలి నుంచి అరుపులు వినిపించాయి. తన కూతురును అదే గ్రామానికి చెందిన మంథని సతీశ్‌ బలాత్కరిస్తూ కనిపించాడు.

ఆమె ప్రతిఘటించడంతో నోట్లో పురుగులమందు పోసేందుకు ఆ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ఆమె తండ్రి గమనించి కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా యువకుడు తప్పించుకుని పారిపోయాడు. కర్ర దెబ్బ కూతురు తలకు తాకడంతో బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని యువతిని మంథని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, తమ ఇంటి పక్కన ఉన్న కరెంటు స్తంభాల విషయమై రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నాయని, దీనిని మనసులో పెట్టుకునే సతీశ్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు