December 2022: వచ్చేస్తున్నాయ్‌ కల్యాణ ఘడియలు.. ఆ 5 ముహూర్తాలే కీలకం!

27 Nov, 2022 07:26 IST|Sakshi

డిసెంబరులో అయిదు శుభ ముహూర్తాలు  

పెళ్లి కళను సంతరించుకోనున్న భాగ్యనగరం   

ఏకం కానున్న 25 వేలకుపైగా జంటలు  

ఈ నెలాఖరుతో తొలగిపోనున్న మూఢాలు 

ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలకు భారీ డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరానికి పెళ్లి కళ రానుంది. మరికొద్ది రోజుల్లో నగరమంతటా బాజాభజంత్రీలు మోగనున్నాయి. మూఢాల కారణంగా మూడు నెలలుగా శుభ కార్యాలు నిలిచిపోయాయి. ఈ నెలాఖరుతో అవి తొలగిపోనున్నాయి. దీంతో డిసెంబరు మొదటి వారం నుంచి పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే  నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫంక్షన్‌ హాళ్లు. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు బుక్‌ అయ్యాయి.

మరోవైపు కొంతకాలంగా స్తబ్దత నెలకొన్న మార్కెట్లు సైతం క్రమంగా కళకళలాడుతున్నాయి. డిసెంబరు నెలలో కేవలం 5 ముహూర్తాలే ఉండడంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ  మేరకు ఒక్కో ఫంక్షన్‌ హాల్‌లో రోజుకు కనీసం రెండు పెళ్లిళ్ల చొప్పున  బుక్‌ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. డిసెంబరు తర్వాత  తిరిగి ఫిబ్రవరి వరకు ముహూర్తాలు లేకపోవడంతోనూ డిమాండ్‌ ఎక్కువగా ఉన్నట్లు పురోహితులు పేర్కొన్నారు. 

ఉందిలే మంచి ముహూర్తం.. 
సాధారణంగా కార్తీకమాసంలో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. కానీ.. ఈసారి శుభకార్యాలకు ఎంతో అనుకూలమైన కార్తీక మాసంలో మూఢాలు ఉండడంతో పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు వంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. అన్ని రకాల శుభ కార్యక్రమాలను నగరవాసులు వాయిదా వేసుకున్నారు. సెప్టెంబరు 22న  మొదలైన  మూఢాలు ఈ నెల 27 వరకు ఉన్నాయి. దీంతో అందరూ డిసెంబరు ముహూర్తాల కోసమే ఎదురు చూస్తున్నారు.

దృక్‌ సిద్ధాంతం మేరకు డిసెంబరులో 4, 8, 14, 17, 18వ తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నట్లు ప్రముఖ వేదపండితులు చిర్రావూరి శివరామకృష్ణ  తెలిపారు. పూర్వ సిద్ధాంతం ప్రకారం ఈ నెలలో మరికొన్ని అదనపు ముహూర్తాలు కూడా ఉన్నప్పటికీ ఈ అయిదే ముఖ్యమైనవి కావడంతో ఆయా రోజుల్లోనే ఎక్కువ పెళ్లిళ్లు జరగనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ శాతం కన్య రాశి, సింహరాశి ముహూర్తాలే ఉన్నాయి. 4వ తేదీ రాత్రి  11.30 గంటలకు, తిరిగి తెల్లవారు జామున ఒంటిగంటకు  మంచి ముహూర్తాలు ఉన్నాయి.  

►8వ తేదీ గురువారం రాత్రి 11.38 గంటలకు కన్యా లగ్నం, రాత్రి 1.20 గంటలకు నిశీధి ముహూర్తం ఉన్నట్లు పురోహిత వర్గాలు పేర్కొన్నాయి. 14వ తేదీన బుధవారం, మహానక్షత్రం రాత్రి  11.27 గంటలకు మంచి  ముహూర్తం ఉంది. 17వ తేదీ రాత్రి హస్తా నక్షత్రం, రాత్రి 11.15 గంటలకు, 18వ తేదీ  ఆదివారం చిత్ర నక్షత్రంలో రాత్రి  11.11 గంటలకు,.  తిరిగి అర్ధరాత్రి  12.47కు  సింహలగ్నం ఉన్నట్లు   తెలిపారు. ఆ తర్వాత జనవరి 26వ తేదీ వరకు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. తిరిగి ఫిబ్రవరి నెలలోనే మరోసారి బాజాభజంత్రీలు  మోగనున్నాయి. దీంతో డిసెంబరు ముహూర్తాలకు  డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. 

►డిసెంబరు నెలలో వేల సంఖ్యలో పెళ్లిళ్ల కోసం సుమారు 10 వేలకు పైగా ఫంక్షన్‌ హాళ్లు. మండపాలు తదితర వేదికలు ఇప్పటికే బుక్‌ అయ్యా యి. సుమారు 25 వేలకు పైగా జంటలు ఈ నెలలో ఒక్కటి కానున్నట్లు పురోహితులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఈ సంఖ్య ఇంకా  పెరి గే అవకాశం కూడా ఉంది. అలాగే ఫంక్షన్‌ హాళ్ల కు సైతం ఇంకా డిమాండ్‌ పెరగనుంది. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, ఇతర మార్కెట్లలో సైతం గిరాకీ ఊపందుకోనుంది.    

ముహూర్తాలు కూడా కలిసి రావచ్చు  
దృక్‌ సిద్ధాంతం ప్రకారం డిసెంబరులో 5 ముహూర్తాలే ఉన్నాయి. కానీ  కొందరు పురోహితులు పూర్వసిద్ధాంతాన్ని అనుసరించి ముహూర్తాలను నిర్ణయిస్తారు. ఈ మేరకు డిసెంబరులో మరిన్ని ముహూర్తాలు కూడా ఉండవచ్చు.   
– చిర్రావూరి శివరామకృష్ణ, వేద పండితులు  

మరిన్ని వార్తలు