అసెంబ్లీకి ఆస్ట్రియా పార్లమెంటరీ బృందం

16 Mar, 2022 03:45 IST|Sakshi

బడ్జెట్‌ సమావేశాలను వీక్షించిన ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌:  రెండురోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆస్ట్రియా పార్లమెం టరీ ప్రతినిధి బృందం మంగళవారం శాసనసభను సందర్శించి బడ్జెట్‌ సమావేశాలను వీక్షించింది. ఈ సందర్భంగా ఆస్ట్రియా ప్రతినిధి బృందం అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తోందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించగా సభ్యులు అభివాదం చేశారు.

ఈ ప్రతినిధి బృందంలో ఆస్ట్రియా నేషనల్‌ కౌన్సిల్‌ (దిగువ సభ) ప్రెసిడెంట్‌ వుల్ఫ్‌గాంగ్‌ సోబోట్కా, ఫెడరల్‌ కౌన్సిల్‌ (ఎగువ సభ) ప్రెసిడెంట్‌ క్రిస్టినా స్వర్జ్‌–ఫచ్‌తోపాటు 17 మంది పార్లమెంట్‌ సభ్యు లు ఉన్నారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో సమావేశమయ్యారు. 400 ఏళ్లకు పైబడిన హైదరాబాద్‌ నగర ప్రత్యేకతలను స్పీకర్‌ వివరించారు. ఆస్ట్రియా ప్రతినిధి బృందం పర్యటన భారత్‌తో సుదృఢ సంబంధాలకు తోడ్పడుతుందని వుల్ఫ్‌గాంగ్‌ సొబోట్కా అన్నారు. 

ఆస్ట్రియాతో సంబంధాలు బలోపేతం: దీక్షిత్‌
ఇండియా, ఆస్ట్రియా  మధ్య సంబంధాలు మరింత బలపడేలా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌లో ఆస్ట్రియా దేశ గౌరవ కాన్సులేట్‌ జనరల్‌ వాగీష్‌ దీక్షిత్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆస్ట్రియా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయాన్ని ఆయన ఆస్ట్రియా పార్లమెంటు సభ్యులతో కలసి ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు