అయ్యో బిడ్డా! కన్నతల్లికి ‘భారం’.. ‘కొన్న’తల్లి దూరం.. అందరూ ఉన్నా అనాథగా..

5 Dec, 2021 03:14 IST|Sakshi
స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూఓ, మహబూబాబాద్‌ 

అభినవ కర్ణుడికి అమ్మే శాపం!

రెండుసార్లు విక్రయించిన సొంత తల్లి

తల్లిదండ్రులకు ఇవ్వలేరు.. పెంచుకున్నవారికి నిబంధనల అడ్డు

ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్న అధికారులు

అందరూ ఉన్నా అనాథగా శిశు గృహలో బాబు

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన  

సాక్షి, మహబూబాబాద్‌: ఆ తల్లి కడుపున పుట్టడమే ఆ చిన్నారికి శాపంగా మారింది. ముక్కుపచ్చలారని వయసు నుంచి రెండేళ్లు వచ్చే నాటికే బాబును ఇద్దరికి ‘అమ్మ’కానికి పెట్టారు. ఇది గుర్తించిన అధికారులు చిన్నారిని వరంగల్‌ శిశుగృహకు పంపించారు. అటు కన్నవారు.. ఇటు పెంచుకున్నవారు ఉన్నా.. ఎవరూలేని అనాథగా బాబు శిశుగృహలో పెరుగుతున్నాడు. అయితే తామే పెంచుకుంటామని వెళ్లిన తల్లిదండ్రులపై మళ్లీ అమ్ముకుంటారన్న అనుమానం.. పెంచుకున్న వారికే బాబును ఇవ్వడానికి ఒప్పుకోని నిబంధనలు.. దీంతో ఏం చేయాలో అర్ధంగాక అధికారులు తలపట్టుకున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తండాలో నివసిస్తున్న గిరిజన మహిళకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో సమీప బంధువుతో సన్నిహితంగా మెలగడంతో ఆ మహిళ 2019 మే నెలలో మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును ఇంటికి తీసుకెళ్తే తమ కుటుంబాల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్న అనుమానంతో ఆమె, ఆ వ్యక్తి శిశువును అమ్మేశారు. విషయం తెలుసుకున్న బాలల రక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులు బాబును తీసుకొచ్చారు.

కేసు నమోదుచేసి, తిరిగి శిశువును తల్లికి అప్పగించారు. కొద్దిరోజుల తరువాత మళ్లీ ఆ శిశువును ఇల్లెందు ప్రాంతానికి చెందిన వారికి తల్లి అమ్మేసింది. మళ్లీ విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ అధికారులు బాబుకోసం వెతికి, 18 నెలల తర్వాత బాబు ఆచూకీ కనుక్కుని ఆమెపై, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో పాటు బాబును తీసుకున్నవారిపై కేసు పెట్టి వరంగల్‌ శిశుగృహకు చిన్నారిని తరలించారు.

బాబును ఎవరికి ఇవ్వాలి?
శిశుగృహలో పెరుగుతున్న బాబు (విరాట్‌)ను ఇప్పుడు ఎవరికి అప్పగించాలన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే రెండుసార్లు విక్రయించిన తల్లికి ఇస్తే మళ్లీ అమ్మేస్తుందన్న భయం.. అలా కాదని ఇప్పటివరకు పెంచుకున్న తల్లిదండ్రులకు ఇవ్వాలంటే ఒప్పుకోని చట్టం.. పోనీ చట్ట ప్రకారం అప్పగించాలంటే దత్తత తీసుకునే దంపతుల వయస్సు వందేళ్లకు మించడంతో నిబంధనలు ఒప్పుకోవడం లేదు. 

బాబు చుట్టూ పైరవీలు: ముద్దులొలికే రూపంలో ఉన్న బాబును అప్పగించే విషయంలో రాజకీయ నాయకులు సైతం రంగప్రవేశం చేశారని తెలుస్తోంది. పెంచుకున్న తల్లిదండ్రులకు ఇప్పించేందుకు జిల్లాలోని కురవి, తొర్రూరు ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నా యకులు సీడబ్ల్యూసీ అధికారులపై ఒత్తిడి తెస్తు న్న ట్లు తెలిసింది. బాబు విషయంలో లక్షల రూపాయ లు చేతులు మారినట్లు కూడా ప్రచారం జరిగింది.

బాబు మా ఆధీనంలోనే ఉన్నాడు
బాబు (విరాట్‌) మా సంరక్షణలోనే ఉన్నాడు. మహబూబాబాద్‌లో శిశురక్ష భవన్‌ లేకపో వడంతో వరంగల్‌ బీఆర్‌ బీకి పంపించాం. చిన్నారి అలనాపాలనా అంతా ప్రభుత్వమే చూసు కుం టోంది. బాబును అప్పగించాలని ఇటు తల్లి దండ్రులు, అటు పెంచుకున్నవారు కూడా కోరు తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతా« దికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.     
– స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూఓ, మహబూబాబాద్‌ 

మరిన్ని వార్తలు