హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్యాబ్‌లు, ఆటోలు.. రోడ్డెక్కని 60 వేల వాహనాలు

2 Jul, 2022 17:12 IST|Sakshi

నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఏ సమయంలోనైనా బుక్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే క్యాబ్‌లు రయ్‌రయ్‌మంటూ దూసుకొచ్చేవి. కానీ కొంతకాలంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాలు, కొన్ని సమయాల్లో మినహా నో క్యాబ్స్‌ అనో, నో ఆటోస్‌ అనో యాప్‌లు చేతులెత్తేస్తున్నాయి. గతేడాది భారీ వర్షాల్లో కూడా సేవలందించిన క్యాబ్స్‌కు ఇప్పుడేమైంది? కొన్నేళ్లుగా క్యాబ్‌లతో కళకళలాడిన భాగ్యనగరం ఇప్పుడు వాటి జాడ కోసం ఎందుకు వెతుక్కోవాల్సి వస్తోంది? 
– సాక్షి, హైదరాబాద్

వాహనాలపై కేంద్రం పిడుగు.. 
కరోనా లాక్‌డౌన్‌తో నగరంలో కొన్ని నెలలపాటు క్యాబ్‌లు, ఆటోలు తిరగక డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వారిలో కొందరు వాహనాలను అమ్మేయగా, ఇల్లు గడవడం కష్టమై మరికొందరు  కార్లను వేరే రకంగా అద్దెలకు ఇచ్చారు.  ఇలా నగరంలో కరోనా వ్యాప్తి తర్వాత క్యాబ్‌ల సంఖ్య తగ్గి కొంత సమస్య ఏర్పడింది. దీనికితోడు డీజిల్‌ ధరలు అమాంతం పెరగడం.. ఆ మేరకు చార్జీలు పెరగకపోవడం ఒక కారణమైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనతో క్యాబ్‌లు, ఆటోలు భారీగా నిలిచిపోయాయి. ఈ కారణంగానే క్యాబ్‌లకు కొరత వచ్చి పడింది.  

ఇదీ సమస్య.. 
కేంద్ర మోటారు వాహనాల చట్టంలో జరిగిన మార్పు మూడు నెలల క్రితం అమలులోకి వచ్చింది. పర్యావరణానికి ప్రాధాన్యమిచ్చే క్రమంలో వాహనాలు కచ్చితంగా ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా లోపాలు సరిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఏటా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందే నిబంధనను కఠినతరం చేసింది. గడువు తీరినా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను రెన్యూవల్‌ చేయించుకోని రవాణా వాహనాలపై రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వసూలు చేసే నిబంధనను తెరపైకి తెచ్చింది. అది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. దీన్ని రాష్ట్ర రవాణా శాఖ సైతం అమలు చేయడం ప్రారంభించింది.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు ముగిసిన నాటి నుంచి రోజుకు రూ.50 చొప్పున లెక్కగట్టి వసూలు చేస్తోంది. గత రెండు నెలలుగా ఇది తీవ్రమైంది. నగరంలో చాలా క్యాబ్‌లు, ఆటోల ఫిట్‌నెస్‌ గడువు ఎప్పుడో ముగిసింది. చాలా వాహనాలకు ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ చేయించుకోవాల్సిన గడువు 3–4 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఒక్కో వాహనంపై రూ.60–70 వేల పెనాల్టీ పెండింగ్‌లో ఉంది. దీంతో వాహనాలను రోడ్డుపైకి తేవడానికి యజమానులు జంకుతున్నారు. అలా ఏకంగా 35 వేలకుపైగా క్యాబ్‌లు, 25–30 వేల ఆటోలు నిలిచిపోయాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే దాదాపు 15 వేల క్యాబ్‌ల డ్రైవర్లు వేరే పనులు చూసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో క్యాబ్‌లు, ఆటోలు లేకపోయేసరికి ప్రయాణికుల బుకింగ్స్‌కు స్పందన తగ్గిపోయింది. 

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు... 
భారీ పెనాల్టీల నుంచి విముక్తి కలిగించాలంటూ పదుల సంఖ్యలో డ్రైవర్లు హైకోర్టును ఆశ్రయించగా ఓ కేసు విషయంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి తీర్పు వచ్చే వరకు రోజుకు రూ. 10 చొప్పున పెనాల్టీ వసూలు చేసి తాత్కాలిక ఫిట్‌నెస్‌ల సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఈ భారాన్ని తగ్గించాలంటూ క్యాబ్‌లు, ఆటోల యూనియన్లు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. కానీ దీనిపై ఇప్పటివరకు రవాణాశాఖ సానుకూల ప్రకటనేదీ విడుదల చేయలేదు.  

కొత్త ఆటోలకూ కష్టమే..
ధాసాధారణంగా ప్రతినెలా నగరంలో దాదాపు ప్రతి నెలా వెయ్యి వరకు పాత ఆటోలను తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్త ఆటోలు తీసుకుంటారు. ఇప్పుడు తుక్కుగా మార్చాలంటే.. అప్పటివరకు ఉన్న ఫిట్‌నెస్‌ పెనాల్టీ చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో తుక్కుగా మార్చే ప్రక్రియ కూడా బాగా తగ్గిపోయింది. కొత్త ఆటోలకు 100 పర్మిట్లు జారీ చేసే చోట 2–3 జారీ అవుతుండటం గమనార్హం. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకు నగర వాసులకు క్యాబ్‌ కష్టాలు తీరేలా లేవు.   

మరిన్ని వార్తలు