ఆటో.. ఎటో..!

31 Jul, 2020 09:38 IST|Sakshi
సికింద్రాబాద్‌ బస్టాప్‌ ఎదుట ప్రయాణికుల కోసం ఆటో డ్రైవర్ల ఎదురుచూపులు

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలినా ఎక్కేవారేరీ?   

తప్పని ప్రైవేట్‌ ఫైనాన్షియర్ల వేధింపులు  

కిస్తీలు కట్టలేక ఆటోలను వదులుకుంటున్న వైనం

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ దెబ్బకు వేలాది మంది ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కొందరు సొంత ఊళ్లకు వెళ్లారు. కానీ అక్కడ కూడా పనుల్లేక తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కరోనా కారణంగా ఆటో ఫైనాన్షియర్లకు చెల్లించాల్సిన ఈఎంఐలు వాయిదా పడ్డాయి. దీంతో కిస్తీ వసూళ్ల కోసం వారు ఇప్పుడు ఆటోడ్రైవర్‌లపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు. కొద్దిపాటి అప్పు ఉన్నా ఆటోలను గుంజుకెళుతున్నారు. గ్రేటర్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 లక్షల మంది ఆటో సేవలను వినియోగించుకుంటారు. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు, ఎల్‌బీనగర్, ఉప్పల్, మెహదీపట్నం నగరంలో ప్రధానమైన కూడళ్లు. ఇవికాక చిన్నాపెద్ద ఆస్పత్రులు ఆటోడ్రైవర్లకు ఆదాయ మార్గాలు. కానీ కోవిడ్‌ కారణంగా ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది.

బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లకు కూడా బ్రేకులు పడ్డాయి. దీంతో రైలు దిగి, బస్సు దిగి ఆటో ఎక్కేవారు లేరు. ఇక ఆస్పత్రులకు వెళ్లేవారు కూడా వీలైనంత వరకు సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. కోవిడ్‌ వైరస్‌ దృష్ట్యా ఆటోలు, క్యాబ్‌లు వినియోగించేందుకు జనం భయం పడుతున్నారు. రవాణారంగంలో ఉన్న అన్ని వర్గాలపైనా ఇది ముప్పేట దాడిగా మారింది.  ఈ క్రమం ఆటోడ్రైవర్లు మరింత అతలాకుతలమయ్యారు. చివరకు స్కూళ్లు, కాలేజీలు, తదితర విద్యాసంస్థలు కూడా మూసి ఉండడంతో గత విద్యాసంవత్సరంలో విద్యార్థుల తరలింపు కోసం ఆటోలు నడిపినవారు కూడా ఇప్పుడు ఎలాంటి ఆదాయమార్గం లేక విలవిలాడుతున్నారు. ‘సికింద్రాబాద్‌ నుంచి వారాసిగూడ వరకు ఒకప్పుడు మంచి గిరాకీ ఉండేది. రోజుకు రూ.800 నుంచి రూ.1000 వరకు కూడా సంపాదించుకున్నాం. ఇప్పుడు రాత్రింబవళ్లు వేచి ఉన్నా రూ.200 కంటే ఎక్కువ రావడం లేదు. ఇంటి కిరాయిలు, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. దీనికి తోడు కిస్తీ కట్టాలని ఫైనాన్స్‌ ఇచ్చినవారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ’’ అడిక్‌మెట్‌కు చెందిన శంకర్‌ ఆవేదన ఇది.  

ముందు నుయ్యి..వెనుక గొయ్యి... 
‘‘ బండి బయటకు తీయాలంటే కూడా భయమేస్తుంది. చాలామంది ప్రయాణికులు ఆటోల వల్ల,  డ్రైవర్ల వల్ల కరోనా వస్తుందేమోననుకుంటున్నారు. కానీ ప్రయాణికుల వల్ల వస్తుందేమోనని మేం భయపడుతున్నాం. అయినా సరే  మరో గత్యంతరం లేక  బండి నడుపుతున్నాం. లేకపోతే ఇంటిల్లిపాది పస్తులుండాల్సి వస్తుంది.’’ ఈసీఐఎల్‌కు చెందిన రాములు ఆందోళన ఇది. కరోనా కారణంగా గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తమను  ఫైనాన్షియర్లు  కాల్చుకుతింటున్నారని, ఆటోలను స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన  వ్యక్తం చేశాడు. సాధారణంగా బస్సులు బంద్‌ అయితే ఆటోలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా ఆటోలు వినియోగించేందుకు కూడా జనం వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు రోజురోజకు పెరుగుతున్న వైరస్‌ ఉధృతి వల్ల  ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. షాపింగ్‌ సెంటర్లు, మార్కెట్లు వెలవెలపోతున్నాయి. దీంతో ఆటోవాలాలు సైతం దివాలా తీశారు.

ఫైనాన్షియర్ల వేధింపులు ఆపాలి 
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్‌ వడ్డీవ్యాపారులు తమ ఆగడాలను ఆపడం లేదు. వసూళ్లను నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పినా అదేపనిగా వేధిస్తున్నారు. దౌర్జన్యంగా ఆటోలను జఫ్తు చేసుకుంటున్నారు. ఈ దాడులను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  – ఏ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం 

ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి  
ఈ పరిస్థితి ఇలాగే ఉంటే బతకడం కష్టం. ప్రభుత్వం ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాలు పంపిణీ చేసినట్టుగానే ఇప్పుడు కూడా  ప్రతి ఆటోడ్రైవర్‌ కుటుంబానికి ఆర్థిక సాయంతోపాటు, నిత్యావసర వస్తువులు ఇవ్వాలి.– భాస్కర్, సికింద్రాబాద్‌ 

‘ ఇంట్లో ఉంటే బతకలేం. రోడ్డెక్కితే గిరాకీ లేదు. బండి బయటకు తీస్తే చాలు వాయిదాలు చెల్లించాలనివేధింపులు.....’ సీతాఫల్‌మండికి చెందిన ఆటోడ్రైవర్‌ వెంకటేష్‌ ఆవేదన ఇది. సొంత ఊళ్లోనూ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. సాగు చేసుకొనేందుకు భూమి లేదు. ఉన్న పాత ఇల్లు ఒకటీ ఈ మధ్యే కూలిపోయింది. ప్రైవేట్‌  ఫైనాన్షియర్‌ వద్ద రుణప్రాతిపదికపైన తీసుకున్న ఆటో తప్ప మరోజీవనాధారం లేదు. కరోనాకు ముందు ఆ ఆటోపైనే  కుటుంబాన్ని పోషించాడు. ఇద్దరు కూతుళ్లలో ఒక అమ్మాయి పెళ్లి చేశాడు. కానీఅకస్మాత్తుగా వచ్చిన కరోనా వైరస్‌ వెంకటేష్‌ కుటుంబాన్ని కష్టాలసుడి గుండంలోకి నెట్టింది. రాత్రింబవళ్లు పడిగాపులు కాసినా పట్టుమని పదిమంది కూడా ఆటో ఎక్కడం లేదు. ఇది ఒక్క వెంకటేష్‌ కథ మాత్రమే కాదు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీవనం కొనసాగిస్తున్నఅనేక మంది ఆటోడ్రైవర్ల దుస్థితి.  

మరిన్ని వార్తలు