నిలువు దోపిడీ! కారు ధరలకు చేరువగా ఆటో రిక్షాలు

26 Jul, 2022 07:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆటోరిక్షా ప్రస్తుత షోరూమ్‌ ధర రూ.2.20 లక్షలు. కానీ అది ఆటోడ్రైవర్‌ చేతికొచ్చేసరికి రూ.4.25 లక్షలకు చేరుతుంది. అంటే సాధారణ ధరపైన రూ.2 లక్షలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. వేల కొద్దీ ఆటో పర్మిట్‌లను తమ గుప్పెట్లో  పెట్టుకొన్న ఫైనాన్షియర్‌లు నిరుపేద ఆటోడ్రైవర్‌లపై సాగిస్తున్న నిలువుదోపిడీ ఇది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్త ఆటో పరి్మట్‌లపైన  ఆర్టీఏ ఆంక్షలు విధించింది. దీంతో పాత ఆటో రిక్షాల స్థానంలో మాత్రమే కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

కాలం చెల్లిన పాత ఆటోలను తుక్కుగా మార్చి ఆ పర్మిట్‌పైన కొత్త ఆటో కొనుగోలు చేయవచ్చు. సుమారు 80 వేలకు పైగా పరి్మట్‌లు ఫైనాన్షియర్‌ల  చేతుల్లోనే ఉన్నాయి. ఫైనాన్స్‌ సంస్థల నుంచి అప్పులు తీసుకొని ఆటోలు కొనుగోలు చేసిన  డ్రైవర్లు చివరకు ఆ అప్పులు చెల్లించలేకపోతున్నారు. దీంతో వారి నుంచి సదరు ఫైనాన్స్‌ సంస్థలు ఆటోలను జఫ్తు చేసుకొని ఆ పరి్మట్‌లను మరో డ్రైవర్‌కు కట్టబెడుతున్నాయి.

ఇలా సుమారు 500 మంది చిన్న, పెద్ద ఫైనాన్షియర్లు, ఫైనాన్స్‌ సంస్థలు నగరంలోని లక్ష మందికిపైగా  ఆటోడ్రైవర్‌లను తమకు శాశ్వత రుణగ్రస్తులుగా మార్చుకొని రూ.వందల కోట్ల మేర వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన కార్యకలాపాలు తాజాగా తిరిగి మొదలయ్యాయి.  

భారీగా పెరిగిన పర్మిట్‌ ధరలు... 
కోవిడ్‌ ఆంక్షలన్నీ తొలగిపోయి ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నగరానికి తిరిగి వలసలు మొదలయ్యాయి. అప్పట్లో కోవిడ్‌ కారణంగా అప్పులు చెల్లించలేక ఆటోరిక్షాలు, క్యాబ్‌లను ఫైనాన్స్‌ సంస్థలకు అప్పగించి సొంత ఊళ్లకు వెళ్లిన వేలాది మంది డ్రైవర్లు ఇప్పుడు తిరిగి ఉపాధి కోసం నగరానికి చేరుకుంటున్నారు. ఆటోల కోసం ఫైనాన్షియర్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు పాత ఆటో పరి్మట్‌ల ధరలను అమాంతంగా పెంచేసి డ్రైవర్‌లకు కట్టబెడుతున్నారు.

కోవిడ్‌కు ముందు  కేవలం రూ.75 వేలు ఉన్న పాత ఆటో పరి్మట్‌ను  ఇప్పుడు  ఏకంగా రూ.1.75 లక్షలకు పెంచారు. నిజానికి  పర్మిట్‌లకు ఎలాంటి ధర ఉండదు. నగరంలో  కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల  పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకొనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇలాంటి పాత పర్మిట్‌లపైన కొత్త  ఆటో కోసం మరో 2.20 లక్షలు చెల్లించవలసి వస్తుంది.

అంటే  ఒక ఆటో ధర ఏకంగా  రూ.4 లక్షలకు చేరుతుంది. దీనికి మరి కొంత సర్వీసు చార్జీలను కలిపి  ఫైనాన్స్‌ సంస్థలు రూ.4.25 లక్షలకు విక్రయిస్తున్నారు. ‘అప్పు చేసి ఆటోలు కొనుగోలు చేస్తున్న డ్రైవర్‌లు మరోసారి రుణగ్రస్తులుగా మారాల్సి వస్తుందని.’ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

దోపిడీని ఆపేదెవరు... 

  • కొత్త పర్మిట్‌లపైన ఆంక్షలు విధించిన రవాణా శాఖ పాత పర్మిట్‌  ధరలను మాత్రం నియంత్రించడం లేదు. పర్మిట్‌ అంటే  ఒక డ్రైవర్‌  ఆటో నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం (ప్రొసీడింగ్స్‌). కానీ ఈ పత్రాలే ఫైనాన్షియర్‌లకు కాసులు కురిపిస్తున్నాయి.
  • ఫైనాన్స్‌ సంస్థల ఈ నిలువు దోపిడీ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు, అన్ని ప్రభుత్వ విభాగాలకు తెలిసిందే. కానీ  అది తమ పరిధిలోని అంశం కాదంటూ అందరూ  చేతులెత్తేయడం గమనార్హం.
  • అంతిమంగా నిరుపేద ఆటోడ్రైవర్‌ సమిధగా మారుతున్నాడు.  

(చదవండి: ఉచిత బియ్యం ఉఫ్‌! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు)

మరిన్ని వార్తలు