‘ఆటోమేషన్‌’ ఆపద..?

31 Jul, 2021 07:49 IST|Sakshi

కంప్యూటర్లు వచ్చిన తరువాత టైప్‌ రైటర్లకు పనిలేకుండా పోయింది.. కంప్యూటర్లు కాస్తా తెలివిమీరి.. రోబోలు, డ్రోన్లు, కృత్రిమ మేథలొచ్చేశాయి..ఇవన్నీ పూర్తి వినియోగంలోకి వస్తే... మనిషి చేసేందుకు పనులుండవు.. ఆటోమేషన్‌ ముప్పు ఇప్పటికైతే సాఫ్ట్‌వేర్‌ రంగానికే కావచ్చుకానీ... ఇంకొన్నేళ్లు పోతే.. సాగు, నిర్మాణ, తయారీ రంగాల్లోనూ హవా చెలాయించడం గ్యారెంటీ.. మరి.. ఈ భారీ మార్పునకు భారత్‌ సిద్ధంగా ఉందా అంటే..ఊహూ.. లేదు అని ఆంటోంది ఆటోడెస్క్‌!

సాక్షి, హైదరాబాద్‌ : ఐటీ రంగంలో ఆటోమేషన్‌తో లక్షల ఉద్యోగాలు పోతాయన్న వార్తలు మనకు కొత్త కాదు. కానీ, ఇతర రంగాలపై దీని ప్రభావం ఇప్పుటికిప్పుడే ఉండదని అనుకుంటూ ఉండగా.. అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆటోడెస్క్‌ భారత్, చైనాలు సహా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో జరి పిన ఒక సర్వే ఇందుకు భిన్నమైన అంచనాలను మన ముందుంచింది. రాబోయే ఆటోమేషన్‌ విప్లవానికి భారత్‌ సన్నద్ధత అంతంత మాత్రమేనని ఈ అధ్యయనం నిర్వహించిన కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ కూడా చెబుతోంది. వివిధ రంగాల్లో ఆటోమేషన్‌ ఎలా జరుగుతోంది? భవిష్యత్‌లో ఉపాధి పరిస్థితి ఏంటి? అనే విషయాలపై 12 ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ఈ సర్వే జరిగింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లపై ఆటోమేషన్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. ఆటోమేషన్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదవ స్థానంలో ఉండగా... సన్నద్ధత విషయంలో తొమ్మిదో స్థానంలో ఉంది.

వ్యవసాయం, తయారీ, నిర్మాణం వంటి రంగాల్లోనే దేశ ప్రజల్లో ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు పొందుతూ ఉండటం ఇందుకు కారణమన్నది ఈ అధ్యయనం అంచనా. ఈ రంగాల్లో ఆటోమేషన్‌ వేగం పుంజుకుంటే.. అదేస్థాయిలో ఉపాధి అవకాశాలు పోతాయన్నమాట. ఒకేరకమైన పనిని పదేపదే మనుషులతో చేయించడం కంటే.. రోబోలు, అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ల సాయంతో చేపడితే.. నాణ్యత పెరగడంతోపాటు, ఖర్చులు కలిసివస్తాయన్నది కంపెనీల ఆలోచన. వ్యాపార సంస్థల్లోని కనీసం సగం మంది తమ రంగాల్లో ఆటోమేషన్‌కు సుముఖంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. 

జాగ్రత్తలు అత్యవసరం..
–ఆటోడెస్క్‌ రీజినల్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ మిట్టల్‌ 
ఆటోమేషన్‌ మోసుకు రాగల సమస్యలను ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. ఆయా రంగాల్లో ఆటోమేషన్‌కు ఉన్న అవకాశాలపై అవగాహన పెంచడం, కొత్త కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా శ్రామిక శక్తికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కోవిడ్‌ కారణంగా పలు రంగాల్లో ఆటోమేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. అదే సమయంలో ఈ ప్రక్రియలు కాస్తా.. కొత్త, అర్థవంతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆయా దేశాలు ఈ మార్పునకు ఎంత సిద్ధంగా ఉన్నాయన్న అంశంపై ఆటోమేషన్‌ ప్రభావం ఆధారపడి ఉంటుంది. డిజిటల్‌ సాక్షరతను పెంచడం, కూలీలకు కొత్త నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేయడం, నైపుణ్యాభివృద్ధికి తగిన మౌలిక సదుపాయాల కల్పన అవసరం.

మరిన్ని వార్తలు