ఆటోడ్రైవర్‌ కుమారుడికి అహ్మదాబాద్‌ ఐఐఎంలో సీటు 

9 May, 2022 09:08 IST|Sakshi
ఆటో నడుపుతున్న తండ్రి రాజిరెడ్డి.. ఇన్‌సెట్లో లక్ష్మికాంతరెడ్డి

సాక్షి, పెద్దపల్లి: ఆటోడ్రైవర్‌ కుమారుడు ఐఐఎంలో సీటు సాధించాడు. నిత్యం పిల్లలను పాఠశాలకు ఆటోలో తీసుకెళ్లి వస్తూ తన పిల్లలను సైతం ఎలాగైనా ఇదే పాఠశాలలో చదివించాలని వారికి మంచి భవిష్యత్‌ అందించాలని అందుకు ఎంతకష్టమైనా భరించేందుకు సిద్ధపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఎన్టీపీసీలోని సెయింట్‌ క్లెయిర్‌ పాఠశాలలో సీటు సాధించాడు. తన కొడుకు 8 నుంచి 10వ తరగతి వరకూ చదివి, అందరి పిల్లల ముందు బెస్ట్‌ అవార్డు అందుకోవడంతో తండ్రి ఆనందానికి అవదులు లేకుండాపోయాయి.

గోదావరిఖని ద్వారకానగర్‌కు చెందిన ఎమిరెడ్డి రాజిరెడ్డి ఆటో నడుపుతూ తన కుమారుడు లక్ష్మికాంత్‌రెడ్డిని సెయింట్‌క్లెయిర్‌ పాఠశాలలో చేర్పించాడు. 8,9,10వ తరగతి వరకు అక్కడే చదివిన లక్ష్మికాంత్‌రెడ్డి టెన్త్‌లో బెస్ట్‌ స్టూడెంట్‌గా ఎంపికై నిత్యం తన తండ్రి ఆటోలో వచ్చే పిల్లల ముందే అవార్డు అందుకున్నాడు. ఇదేస్ఫూర్తితో ముందుకు సాగి కరీంనగర్‌లో ఇంటర్‌లో చేరి స్కాలర్‌షిప్‌తో చదువు పూర్తిచేశాడు. ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌లో 6వేల ర్యాంకు సాధించి హైదరాబాద్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు.    

తండ్రికి పక్షవాతం... 
లక్ష్మికాంత్‌రెడ్డి చదువు కొనసాగిస్తుండగా తండ్రికి పక్షవాతం వచ్చింది. దీంతో ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ బెదరకుండా ఇంజినీరింగ్‌ చేస్తూ రెడ్డిహాస్టల్‌లో ఉండేవాడు. చదువుకు డబ్బులు సరిపోకపోవడంతో ట్యూషన్‌ చెప్పి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇంజినీరింగ్‌ పూర్తవుతున్న క్రమంలో క్యాంపస్‌ సెలక్షన్స్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపికై 2016 నుంచి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహకారం అందించాడు. ఈక్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఐఐఎం ఎంట్రన్స్‌ పరీక్ష రాసి 610 మార్కులు సాధించాడు. మంచి మార్కులు రావడంతో అహ్మదాబాద్‌ ఐఐఎంలో సీటు లభించింది. ఇదే కళాశాల ఆవరణలోని బ్యాంకులో లోన్‌ తీసుకుని పేమెంట్‌ సీటు పొందాడు. ఏడాదిలో చదవు పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధిస్తాడని కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

నాన్న కృషితో ఈ స్థాయికి ఎదిగా.. 
నా చదువుకోసం నాన్న చాలా కష్టపడ్డాడు. ఆటోలో వెళ్లే పిల్లల ముందు ఉత్తమ విద్యార్థిగా అవార్డు సాధించడం ఆనందంగా ఉంది. స్కాలర్‌షిప్‌తో ఇంటర్‌ పూర్తి చేశా. పట్టుదలతో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువు కొనసాగించా. రెడ్డీస్‌ హాస్టల్‌ వారందించిన సహకారంతో ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేశా. అహ్మ దాబాద్‌ ఐఐఎంలో సీటు లభించడం చాలా సంతోషంగా ఉంది.
 – లక్ష్మికాంతరెడ్డి, విద్యార్థి

మరిన్ని వార్తలు