ఎయిర్‌పోర్ట్‌కు ఆటంకాలు!

11 Aug, 2020 11:53 IST|Sakshi
అధికారులు రూపొందించిన మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఏవియేషన్‌ అధికారి శ్రీనివాసమూర్తి

ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఏవియేషన్‌ అధికారి

గుట్టలు, హైటెన్షన్‌ వైర్లు అడ్డంకిగా ఉన్నాయని అభిప్రాయం  

కొత్త మ్యాప్‌ రూపొందించాలని ఆదేశం

పాలకుర్తి(రామగుండం): దశాబ్దకాలంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావాసులను ఊరిస్తున్న బసంత్‌నగర్‌ విమానాశ్రయ ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏవియేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కన్సల్టెంట్‌ ఇంజినీర్‌ శ్రీనివాసమూర్తి సోమవారం జిల్లా అధికారులతో కలిసి బసంత్‌నగర్‌ విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. వర్షం కురుస్తుండడంతో ప్రతిపాదిత స్థలంలో గల పాతభవనంలో లాప్‌ట్యాప్‌ సాయంతో గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా స్థానిక అధికారులు గతంలో సర్వే చేసి గుర్తించిన స్థలంలో విమానాశ్రయ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈనేపథ్యంలో అధికారులు గుర్తించిన స్థలం సమీపంలో కురుమపల్లి గ్రామానికి చెందిన కొన్ని ఇళ్లు, హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్లు, మండల ప్రధాన రహదారి, సాగునీరు అందించే కాలువలు ఉండటాన్ని గుర్తించి, వీటన్నింటి దృష్ట్యా స్థానికంగా విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా లేదని తెలిపారు. కన్నాల బోడగుట్ట, కొత్తపల్లి గ్రామ సమీపంలోని మరో గుట్ట కూడా అవరోధాలుగా ఉన్నాయన్నారు. జిల్లాలో మరోచోట అనుకూలమైన స్థలం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే జిల్లాలో ఇక్కడ తప్ప వేరేచోట ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదని అధికారులు తెలుపగావిమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలానికి దాదాపు 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా మ్యాప్‌ను రూపొందించాలని, ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే గుర్తించిన స్థలంలో ఎన్ని విద్యుత్‌ టవర్లు ఉన్నాయి, వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయమై సంబంధిత అధికారులతో చర్చించాలని అధికారులకు శ్రీనివాసమూర్తి సూచించారు. పట్టా భూమి, ప్రభుత్వ భూమి ఎంత, ఎన్ని ఇళ్లు తొలగించాలో పూర్తి వివరాలతో కొత్త మ్యాప్‌ రూపొందించి రెండురోజుల్లో నివేదికను అందజేయాలని అధికారులను కోరారు.

అనంతరం ప్రతిపాదిత స్థలంలో గల విద్యుత్‌ టవర్లు, సమీపంలోని గుట్టలు, స్థానిక పరిస్థితులను ఫొటో తీసుకున్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో శంకరయ్య, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాఘవాచారి, డీఈ రాములు, ఈఈ నర్సింహాచారి, డీఐఓ విజయ్‌శంకర్, తహసీల్దార్‌ రాజమణి, బసంత్‌నగర్, పాలకుర్తి గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కాగా విమానాశ్రయ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సర్వేకు ఏవియేషన్‌ అధికారులు రావడం, స్థానిక గుట్టలు, హైటెన్షన్‌ వైర్లు అడ్డంకిగా ఉన్నాయని తెలుపడం కొన్నేళ్లుగా పరిపాటిగా మారింది. ఈనేపథ్యంలో ఇన్నేళ్లుగా అధికారులు, పాలకులు ఈ అవరోధాలను తొలగించి విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ఏవియేషన్‌ అధికారి పర్యటన కూడా గతంలో వలె ‘షరా మాములు’గానే మారిందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు