ఫావిపిరవిర్‌ ఏపీఐ తయారీకి ఆవ్రా ల్యాబ్‌కు అనుమతి

27 Jul, 2020 04:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించే ఫావిపిరవిర్‌ తయారీకి అవసరమైన ఆక్టివ్‌ ఫార్మా ఇంగ్రేడియంట్స్‌ (ఏపీఐ) రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ తమకు అనుమతులిచ్చినట్లు హైదరాబాద్‌లోని ఆవ్రా ల్యాబ్‌ ఆదివారం ప్రకటించింది. దేశీయంగా అందుబాటులో ఉన్న రసాయనాలతోనే ఈ మందును సులువుగా తయారు చేసేందుకు తాము ఓ పద్ధతిని అభివృద్ధి చేశామని, తయారైన ఏపీఐను ఫార్మా కంపెనీ సిప్లాకు సరఫరా చేస్తున్నామని ఆవ్రా ల్యాబ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.వి.రామారావు ఆ ప్రకటనలో వివరించారు. 

సిప్లా ఈ మందును సిప్లెంజా పేరుతో త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయవచ్చునని ఆయన చెప్పారు. ఇప్పటికే తాము రెండు బ్యాచ్‌లుగా 46 కిలోల ఏపీఐని సిప్లాకు అందించామని, త్వరలో ఇంకో బ్యాచ్‌ను సరఫరా చేస్తున్నామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)లో పనిచేస్తున్న సమయంలోనే తాను సిప్లా అధ్యక్షుడు డాక్టర్‌ యూసుఫ్‌ హమీద్‌తో కలసి పనిచేశానని, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ చికిత్సకు ప్రయోగించే యాంటీ రెట్రోవైరల్‌ మందులను చౌకగా తయారు చేశామని ఆయన తెలిపారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి సిప్లాతో కలసి పనిచేసే అవకాశం దక్కిందన్నారు. సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్‌ ఎ.వి.రామారావు ఆవ్రా ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు