తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట

18 Apr, 2023 05:29 IST|Sakshi
నెల్లుట్ల పంచాయతీకి సంబంధించిన అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటున్న సర్పంచ్‌ స్వరూపరాణి. చిత్రంలో మంత్రి ఎర్రబెల్లి

9 కేటగిరీలకుగాను ఎనిమిదింటిలో ర్యాంకులు  

నాలుగు విభాగాల్లో మొదటి ర్యాంకు 

46 జాతీయ అవార్డుల్లో 13 కైవసం 

రాష్ట్రపతి నుంచి అందుకున్న ప్రజాప్రతినిధులు 

ఇదే స్ఫూర్తితో దేశమంతా పల్లెల అభివృద్ధి: కేసీఆర్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డుల పంట పండించాయి. జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయి. మొత్తం 9 విభాగాలకుగాను 8 విభాగాల్లో విశేష ప్రతిభ కనబర్చి అవార్డులను సొంతం చేసుకొని రాష్ట్రపతితో ప్రశంసలు అందుకున్నాయి. జాతీయ పంచాయతీ అవార్డులు–2023లో భాగంగా కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ గెలుచుకుంది. 9 కేటగిరీల్లో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీల్లో పంచాయతీలు అవార్డులు సాధించాయి. దీంతో తెలంగాణను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేకంగా అభినందించారు.

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో సోమవారం జరిగిన పంచాయత్‌ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, అధికారులు అందుకున్నారు.  

నాలుగు కేటగిరీల్లో నాలుగు మొదటి ర్యాంకులు 
దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ విభాగంలో నాలుగు కేటగిరీల్లో నాలుగు గ్రామాలు మొదటి ర్యాంకులు సాధించగా, రెండు గ్రామాలు రెండో ర్యాంకులను, మరో రెండు గ్రామాలు మూడో ర్యాంకులను సాధించాయి. ఐదు నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలను తెలంగాణ కైవసం చేసుకుంది. అవార్డుల కార్యక్రమం అనంతరం మంత్రి ఎర్రబెల్లి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వల్ల జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమం, అది సాధించిన ఫలితాలను వివరించారు.

దేశంలో తెలంగాణ మాత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు పంచాయతీలకు సక్రమంగా అందజేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనా పథంలో పనిచేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలపాలని అవార్డు గ్రహీతలకు సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. 

దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ : 
1) ఆరోగ్యకర పంచాయతీ: గౌతంపూర్‌– 1వ ర్యాంకు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)  
2) నీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: నెల్లుట్ల– 1వ ర్యాంకు(జనగాం జిల్లా)  
3) సామాజిక భద్రత పంచాయతీ: కొంగట్‌పల్లి– 1వ ర్యాంకు (మహబూబ్‌నగర్‌ జిల్లా) 
4) మహిళలకు స్నేహపూర్వక పంచాయతీ: అయిపూర్‌–) 1 వ ర్యాంకు (సూర్యాపేట జిల్లా)  
5) పేదరికంలేని మెరుగైన జీవనోపాధి పంచాయతీ: మన్‌దొడ్డి– 2వ ర్యాంక్‌ (జోగులాంబ గద్వాల్‌ జిల్లా) 
6) సుపరిపాలన పంచాయతీ: చీమలదారి– 2వ ర్యాంక్‌ (వికారాబాద్‌ జిల్లా)  
7) పరిశుభ్ర పంచాయతీ : సుల్తాన్‌పూర్‌–3వ ర్యాంకు (పెద్దపల్లి జిల్లా) 
8) స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు ఉన్న పంచాయతీ: గంభీరావ్‌పేట– 3వ ర్యాంకు (రాజన్న సిరిసిల్ల జిల్లా)  
 
నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తం పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారం... 
బెస్ట్‌ బ్లాక్‌ పంచాయతీ: తిమ్మాపూర్‌(ఎల్‌ఎండీ)– 2వ ర్యాంకు (కరీంనగర్‌ జిల్లా)  
బెస్ట్‌ డిస్ట్రిక్ట్‌ పంచాయతీ: ములుగు– 2వ ర్యాంకు 
గ్రామ ఊర్జా స్వరాజ్‌ ప్రత్యేక పంచాయతీ అవార్డు : ముక్రా– 3వ ర్యాంకు (ఆదిలాబాద్‌ జిల్లా) 
కార్బన్‌ న్యూట్రల్‌ ప్రత్యేక పంచాయతీ అవార్డు: కన్హా– 2వ ర్యాంకు (రంగారెడ్డి జిల్లా) 
గ్రామ ఊర్జా స్వరాజ్‌ ప్రత్యేక పంచాయతీ అవార్డు : ఎర్రవెల్లికి ప్రత్యేక ప్రశంస (సిద్ధిపేట జిల్లా) 
 
ఆ పంచాయతీలు రాష్ట్రానికి గర్వకారణం:– సీఎం కేసీఆర్‌  
సాక్షి, హైదరాబాద్‌: పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృద్ధి ఇతివృత్తాల విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ అభినందించారు.

‘దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీలు పోటీపడగా అందులో కేవలం 46 గ్రామాలు అవార్డులు దక్కించుకున్నాయి. వాటిలో 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయి. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్టు ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్ప విషయం’అని పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు