ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు: సీఎం కేసీఆర్

26 Jul, 2021 16:39 IST|Sakshi

సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళితబంధుపై అవగాహన సదస్సు

సాక్షి, హైదరాబాద్‌: హుజురాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం దళితబంధుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, వంద శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. దళితులకు స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణ కోసం ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.

దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. వారం, పది రోజుల్లో హుజురాబాద్‌లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

దళిత బంధు లబ్ధిదారులకు గుర్తింపు కార్డు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌ను ఐడీకార్డులో చేర్చి పథకం అమలు చేస్తామని తెలిపారు. పథకం అమలు తీరు సమాచారమంతా పొందుపరుస్తామన్నారు. పథకం అమలులో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారుడు ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని భరోసానిచ్చారు. 

లబ్ధిదారులకు దళిత బీమా వర్తింపజేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. మంత్రి సహా, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ డెవలప్‌మెంట్‌శాఖ, ఉన్నతాధికారులు ఈ కార్యాచరణపై కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. కొంచెం ఆలస్యమైనా దశల వారీగా దళిత బీమాను అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తలు