సికింద్రాబాద్‌ మహాత్మాగాంధీ రోడ్డు ఏరియాకు ఎన్నో ప్రత్యేకతలు 

11 Aug, 2022 07:54 IST|Sakshi

నాటి జేమ్స్‌ స్ట్రీట్‌...ఎంజీ రోడ్డుగా మారిన వేళ..

1929లో ఇక్కడి నుంచే నగరంలో పర్యటించిన మహాత్ముడు

సాక్షి, హైదరాబాద్‌: 75 ఏళ్ల భారత స్వాతంత్ర సమరోత్సవాన్ని పురస్కరించుకొని.. అప్పటి మహా సంగ్రామ సమయంలో హైదరాబాద్‌ నగరంతో ముడిపడి ఉన్న అద్భుత ఘట్టాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ మొదటిసారి నగరంలో పర్యటించిన సందర్భానికి ప్రత్యేక విశేషముంది. 1929 ఏప్రిల్‌ 7వ తేదీన గాంధీ మొదటిసారి నగరానికి విచ్చేశారు.

ఆ రోజు జేమ్స్‌ స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌లో దిగిన గాంధీజీ. అక్కడి నుంచి సుల్తాన్‌ బజార్‌ చేరుకున్నారు. ఈ సందర్భానికి గుర్తుగా భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత జేమ్స్‌ స్ట్రీట్‌కు ఎంజీ (మహాత్మా గాంధీ) రోడ్డుగా  నామకరణం చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతంలో నివాసమున్న జేమ్స్‌ కిర్క్‌పాట్రిక్‌ పేరు మీద ఆ వీధిని జేమ్స్‌ స్ట్రీట్‌గా పిలిచారు. 

వ్యాపారానికి కేంద్రం 
ప్రస్తుత ఎంజీ రోడ్డు జేమ్స్‌ స్ట్రీట్‌గా పిలువబడుతున్నప్పటి నుంచే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జేమ్స్‌ స్ట్రీట్‌ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్తక వ్యాపారాలకు చెందిన పెద్ద షాప్‌లు దర్శనమిస్తాయి. దాదాపు 150 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గోల్డ్‌ మార్కెట్‌ అభివృద్ధి చెందుతూ వస్తుంది. జనరల్‌ బజార్, క్లాత్‌ మార్కెట్‌కు ఎంజీ రోడ్డు మీదుగానే చేరుకునేవారు.

ఇక్కడి వస్త్ర వ్యాపారం గురుంచి తెలుసుకున్న మహాత్మా గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోని వస్త్ర వ్యాపారానికి హైదరాబాద్‌–సికింద్రాబాద్‌ జంట నగరాలు ప్రత్యేక కేంద్రాలని కొనియాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాహనాలు ఎంజీ రోడ్‌ మీదుగానే ప్రయాణిస్తాయి. నగరంలోని మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్, రాణీ గంజ్‌ బస్‌ డిపో, జూబ్లీ బస్టాండ్‌లకు మధ్య వారధిగా కూడా ఎంజీ రోడ్‌ ఉంటుంది.

ప్రభుత్వం వారసత్వ కట్టడంగా గుర్తించిన మలానీ భవనం కూడా ఎంజీ రోడ్‌లోనే ఉంది. ఈ భవనాన్ని నిర్మించిన దేవాన్‌ బహదూర్‌ రాంగోపాల్‌ మలానీ పోలీసు శాఖకు విరాళంగా ఇవ్వగా..ఈ భవనం పోలీస్‌ స్టేషన్‌గా మారింది. ఇక్కడే ఉన్న గడియారాన్ని 1998లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించింది.   

ఆ విగ్రహం.. ఎంతో ప్రత్యేకం..
ప్రస్తుతం ఎంజీ రోడ్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్యారడైజ్‌ బిర్యానీ రెస్టారెంట్‌ స్థానంలో ప్యారడైజ్‌ థియేటర్‌ ఉండేది. ఆ థియేటర్‌ యజమాని తొడుపునూరి అంజయ్య గౌడ్‌ గాంధీజీ పర్యటనకు గుర్తుగా అప్పట్లోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని విరాళంగా అందించారు. 1951లో ఈ విషయం తెలుసుకున్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో ప్రత్యేకంగా ఇటలీలో తయారు చేయించారని సమాచారం. 70 ఏళ్లుగా ఈ విగ్రహం ఎంజీ రోడ్డులో అందరికీ కనిపిస్తుంది. ఈ గాంధీ సర్కిల్‌కు ఇటీవల జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులను చేపట్టారు.   

మరిన్ని వార్తలు