ఆజంజాహిలో కలెక్టరేట్‌ కష్టమేనా! 

27 Oct, 2021 04:07 IST|Sakshi

ఇళ్ల స్థలాలపై సుప్రీం తీర్పుతో అనుమానాలు 

ఆటోనగర్‌ స్థలం పరిశీలించే అవకాశం 

సాక్షి, వరంగల్‌: ఆజంజాహి మిల్లు స్థలంలో నిర్మించ తలపెట్టిన వరంగల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనం నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లులోని 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ భవనం నిర్మిద్దామనుకున్నా ఈ సంస్థ కార్మికుల విషయంలో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అక్కడ కలెక్టరేట్‌ నిర్మాణం కష్టం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మిల్లు మూతబడిన తర్వాత జీఓ 463 ప్రకారం 2007లో 134 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలం ఉచితంగా కేటాయించారు.

తమకు కేటాయించక పోవడంతో మిగిలినవారు హైకోర్టును ఆశ్రయించారు. మిగతా 318 మంది కార్మికులకు స్థలాలు ఇవ్వడం సబబేనంటూ సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. మంగళవారం అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించింది. దీంతో అక్కడ కార్మికులకు పోనూ మిగిలే కొద్ది స్థలంలో కలెక్టరేట్‌ కడతారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కలెక్టర్‌ గోపి వ్యక్తిగతంగా సమీక్షించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది.

ఒకవేళ ఆజంజాహి మిల్లులో కాకుంటే ఆటోనగర్‌లోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశముందని వినవస్తోంది. ఇలావుండగా సుప్రీంకోర్టు తీర్పుపై ఆజంజాహి మిల్లు రిటైర్డ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి  ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా తమకు స్థలాలు కేటాయించాలని కోరారు.

మరిన్ని వార్తలు