దొరల కుటుంబ పాలన పోవాలి: వైఎస్‌ షర్మిల

20 Mar, 2021 03:58 IST|Sakshi
శుక్రవారం లోటస్‌పాండ్‌లో షర్మిలతో భేటీ అయిన సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, అజహరుద్దీన్‌ తనయుడు మహ్మద్‌ అసదుద్దీన్‌  

ఖమ్మం జిల్లా నేతలతో భేటీలో వై.ఎస్‌. షర్మిల..

ఏప్రిల్‌ 9న ఖమ్మం సభ చరిత్రలో జరగని విధంగా ఉండాలని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో దొరల కుటుంబ పాలన పోవాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్‌. షర్మిల పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఇంతవరకు చరిత్రలో జరగని విధంగా ఏప్రిల్‌ 9న  ఖమ్మం సభ జరగాలన్నారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేయాలని, ఆ దశగా వ్యూహరచన చేయాలని ఖమ్మం, పార్టీ ముఖ్య నేతలకు ఆమె సూచించారు. ఆ వేదికపైనే పార్టీ విధివిధానాలపై ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఖమ్మం సభ కోసం కో–ఆర్డినేషన్‌ కమిటీని వేశారు. షర్మిలమ్మ రాజ్యం కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని, రాజన్న సంక్షేమ పాలన కోసమే తాను ముందుకు వచ్చానన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధిని వైఎస్సార్‌ కోరుకున్నారని, ఖమ్మం జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న వారికి వైఎస్సార్‌ పట్టాలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డి రెండు ప్రాంతాలను రెండు కళ్లలా చూసుకునేవారన్నారు.

మరిన్ని వార్తలు