హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు

21 May, 2022 02:22 IST|Sakshi

రెండు కేసులు నమోదు

భారత్‌లో నమోదు కావడం ఇదే తొలిసారి

భయపడాల్సిన పని లేదంటున్న వైద్యనిపుణులు

సాక్షి, హైదరాబాద్‌:  ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్‌ వేరియంట్‌ కేసులు తెలంగాణలో వెలుగుచూశాయి. ఇవి దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నమోదయ్యాయి. సబ్‌ వేరియంట్‌ ‘బీఏ.4’కేసు ఈ నెల తొమ్మిదో తేదీన నమోదైంది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగిన దక్షిణాఫ్రికాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించగా బీఏ.4 సోకినట్లు నిర్ధారణ అయింది.

మరో సబ్‌ వేరియంట్‌ ‘బీఏ.2.12.1’కేసు కూడా ఈ నెల ఆరో తేదీన నమోదైంది. ఇటీవల అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తెలంగాణకు చెందిన 51 ఏళ్ల వ్యక్తిలో అది బయటపడింది. ఈ ఇద్దరి నమూనాలను సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నొస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ)లో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా రెండు వేర్వేరు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు ఉన్నట్లుగా తేలింది.

అయితే ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో ఇప్పటివరకు తెలియరాలేదు. వారు వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణలోనే ఆసుపత్రుల్లో ఉన్నారా? లేదా? అన్న వివరాలను అధికారులు వెల్లడించడంలేదు. కాగా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కోవిడ్‌ కేసుల ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ’బీఏ.4 ’ కేసులు భారత్‌లోని మరిన్ని నగరాల్లో నమోదయ్యే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు కరోనా వచ్చి, రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి కూడా ఇవి సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్‌ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ రెండు సబ్‌ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయపడుతున్నారు.  

చదవండి: మంకీపాక్స్‌ సెక్స్‌ వల్లే విజృంభణ!

మరిన్ని వార్తలు