తల్లీబిడ్డ కోసం.. ‘బేబీ బెర్త్‌’

11 May, 2022 01:49 IST|Sakshi

రైల్వే ప్రయాణం సరసమైన ధరల్లో సౌకర్యవంతంగా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే పిల్లాపాపలతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. కానీ చిన్న పిల్లలతో వెళ్లే తల్లులు మాత్రం బెర్త్‌లో పడుకునే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకే మదర్స్‌ డే సందర్భంగా తల్లులకు రైల్వే కొత్త బహుమతి అందించింది. ‘బేబీ బెర్త్‌’ను అందుబాటులోకి తెచ్చింది.

బోగీలో లోయర్‌ మెయిన్‌ బెర్త్‌కు అనుసంధానంగా మడిచే (ఫోల్డబుల్‌) బేబీ బెర్త్‌ను ఏర్పాటు చేస్తోంది. తొలుత లక్నో మెయిల్‌లో పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఓ బోగీలోని రెండు సీట్లకు ఈ బెర్త్‌లను జత చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకొని మిగతా రైళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.  

బేబీ బెర్త్‌ గురించి మరిన్ని విషయాలు.. 
♦ఈ బెర్త్‌ లోయర్‌ బెర్త్‌ కిందకు మడిచిపెట్టి ఉంటుంది. కింది నుంచి పైకి లాగి పెద్ద బెర్త్‌కు సమానంగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.  
♦బేబీ బెర్త్‌ కిందికి వంగిపోకుండా కింద స్టీల్‌ లాక్‌లు ఉంటాయి. వాటిని మెయిన్‌ బెర్త్‌కు ఉన్న రంధ్రాల్లోకి నెట్టాలి. చిన్నారి పడిపోకుండా ఉండేందుకు బెల్టులు ఉంటాయి. ♦ప్రయాణం అయిపోయాక స్టీల్‌ లాక్‌లను తీసేసి మళ్లీ మెయిన్‌ బెర్త్‌ కిందికి మడతబెట్టాలి.  
♦చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్నామని బుకింగ్‌ సమయంలో చెబితే బెర్త్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు.     
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌    

మరిన్ని వార్తలు