‘గుప్పెడంత’ శిశువుకు ప్రాణం పోశారు! 

23 Sep, 2022 01:22 IST|Sakshi
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న పాపతో తల్లి  

700 గ్రాముల బరువున్న శిశువుకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స  

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలోకార్పొరేట్‌ తరహా సేవలు 

సిద్దిపేట కమాన్‌: నెలలు నిండకుండా 700 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు రెండు నెలలపాటు చికిత్స అందించి 1,470 (1.47కేజీ) గ్రాముల బరువు వచ్చేలా చేశారు. సంపూర్ణ ఆరోగ్యం చేకూరాక గురువారం డిశ్చార్జి చేశారు. ఇదేదో కార్పొరేట్‌ ఆస్పత్రిలో జరిగిన చికిత్స కాదు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల ఘనత. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనుబంధ జనరల్‌ ఆస్పత్రిలో కార్పొరేట్‌ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.  

రూ.20 లక్షల వైద్యం ఉచితంగా.. 
సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన రెహనా ఏడు నెలల గర్భిణి. జూలై 20న సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించి డెలివరీ చేశారు. నెలలు నిండకపోవడంతో 700 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు ఎస్‌ఎన్‌సీ యూలో ఉంచి పీడియాట్రిక్‌ విభాగ హెచ్‌ఓడీ, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో చికి త్స అందించారు. ఆరోగ్యం మెరుగవడంతో గురువారం శిశువును డిశ్చార్జి చేసినట్లు వైద్యు లు తెలిపారు.

మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ విమలా థామస్, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. నెలలు నిండకుండా జన్మించిన పాపకు ఎస్‌ఎన్‌సీయూ, కంగారు మదర్‌ కేర్‌ యూనిట్‌లలో సపోర్టివ్‌ కేర్‌ ద్వారా 62 రోజులపాటు వైద్యం అందించినట్లు తెలిపారు. చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ. 15 లక్షల నుంచి 20 లక్షల ఖర్చు అవుతుందన్నారు.

లక్షల విలువైన వైద్య సేవలను మంత్రి హరీశ్‌రావు కృషి, సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందుతున్నాయని చెప్పారు. వైద్య సేవలు అందించిన వారిలో చిన్న పిల్లల వైద్యులు కోట వేణు, శ్రీలత, సందీప్, సప్తరుషీ, రవి, గ్రీష్మ ఉన్నారు. శిశువు ఆరోగ్యంగా డిశ్చార్జి కావడంతో తల్లిదండ్రులు రెహనా, సాజిద్‌బాబా హర్షం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు