అరుదైన శస్త్ర చికిత్స.. ప్రసవం జరుగుతుండగా శిశువుకు సర్జరీ.. 11 నిమిషాల్లోనే

28 Oct, 2022 14:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు తొలిసారిగా అరుదైన శస్త్ర చికిత్స  చేశారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు ఏర్పడిన కణితిని ప్రసవ సమయంలోనే తొలగించారు. బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వరంగల్‌కు చెందిన ఓ మహిళ పలుమార్లు గర్భస్రావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గర్భం దా ఆమె ఈసారి గర్భాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ, గర్భస్థ శిశువుకు మెడపై భారీ కణితి ఉన్నట్టు స్కానింగ్‌ ద్వారా అక్కడి వైద్యులు నిర్ధారించారు.

ఆ దశలో చికిత్స అసాధ్యం కావడంతో మరోసారి గర్భస్రావం చేయించుకుంటేనే మేలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో నగరానికి వచ్చి రెయిన్‌బో వైద్యులను సంప్రదించారు. అనంతరం రెయిన్‌బో వైద్యుల పర్యవేక్షణలో 9 నెలలు నిండిన అనంతరం.. వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేశారు. ఓ వైపు ప్రసవం జరుగుతున్న సమయంలోనే మరోవైపు బిడ్డ మెడకు ఉన్న కణితిని కూడా తొలగించారు. అత్యంత సంక్లిష్టమైన ఎక్సూటరో ఇంట్రా పార్టమ్‌ ట్రీట్‌మెంట్‌ (ఎగ్జిట్‌) ద్వారా ఈ కణితి తొలగింపు ప్రక్రియ నిర్వహించారు.

పాక్షిక ప్రసవం సమయంలో తల ఒక్కటే బయట ఉండి మిగిలిన దేహమంతా తల్లి గర్భాన్ని అంటిపెట్టుకుని ఉండగానే 11 నిమిషాల అత్యంత స్వల్ప సమయంలో శస్త్ర చికిత్స జరగడం వైద్యరంగంలో అపూర్వమని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం ప్రస్తుతం తల్లీ బిడ్డా  క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్స కోసం రెయిన్‌బో ఆస్పత్రికి చెందిన వివిధ విభాగాలకు చెందిన 25 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారని తెలిపారు.

(చదవండి: టెన్త్‌లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్‌సీఈఆర్‌టీ మొగ్గు ఎటువైపు?)

మరిన్ని వార్తలు