రాయలేని స్మరణ్‌.. గంటకు 40 పేజీలు రాసేలా తల్లి ప్రాక్టీస్‌.. సివిల్స్‌లో 676వ ర్యాంకు

4 Jun, 2022 15:42 IST|Sakshi

బచ్చు స్మరణ్‌రాజ్‌. సివిల్స్‌ 676వ ర్యాంకు విజేత. లక్షల మంది పోటీపడిన పరీక్షల్లో అతని ఆలోచనాధారకు తల్లి నాగరాణి అక్షర రూపమిచ్చారు. సివిల్స్‌కోసం స్మరణ్‌తో పాటు ఆమె సైతం అహర్నిశలు శ్రమించారు. 27ఏళ్ల క్రితం డిగ్రీతో చదువు ఆపేసిన ఆమె కలానికి పదును పెట్టి.. సెకన్లు, నిమిషాలను లెక్కిస్తూ కాగితాలు నింపేశారు. ప్రతి ప్రశ్నకు అతడు మాటల్లో సమాధానం చెబుతుంటే ఆమె తన కలంతో అక్షరాలను పరుగులు పెట్టించారు. కొడుకు విజయంలో ప్రత్యక్ష భాగస్వామిగా నిలిచిన నాగరాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు..

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ తార్నాకకు చెందిన స్మరణ్‌ చెన్నై ఐఐటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ (బీటెక్‌) పూర్తి చేశారు. 2016 డిసెంబర్‌లో ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. చేరిన కొద్ది రోజులకే 2017 ఫిబ్రవరిలో ఆకస్మాత్తుగా అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న స్మరణ్‌ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌ హేమరేజ్‌గా నిర్ధారించారు. శస్త్రచికిత్స తప్పనిసరైంది. 

కలం పట్టుకోవడమే కష్టం...
చెన్నైలోనే ఓ ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన అరుదైన సర్జరీతో అతడు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు. మెదడుకు రక్షణగా ఉండే  కపాల భాగాన్ని 37 రోజులు అతని పొట్టలోనే భద్రపరిచి అనంతరం తలకు అమర్చి కుట్లువేశారు. కానీ బ్రెయిన్‌ హేమరేజ్‌తో కుడివైపు శరీరానికి పక్షవాతం వచ్చింది. మరో మూడున్నరేళ్ల పాటు ఫిజియోథెరపీ చికిత్స పొందాడు.

కుడివైపు భాగం అతని స్వాధీనంలోకి వచ్చింది. కానీ చేతివేళ్ల  కదలిక కష్టమైంది. చదవగలడు. కానీ రాయలేడు. ఐఏఎస్‌ కావాలని కలలుగన్న స్మరణ్‌కు అది అవరోధంగా మారింది. అంతేకాదు.. కొన్ని సంస్థలైతే అతనికి  శిక్షణనిచ్చేందుకూ నిరాకరించాయి. మరోసారి నిరాశకు గురైన స్మరణ్‌ కలను సాకారం చేయాలని తల్లిదండ్రులు నాగరాణి, రమేష్‌లు సంకల్పించారు. సివిల్స్‌ కోచింగ్‌ ఇస్తోన్న బాలలతను సంప్రదించారు. అక్కడ అతని ఆశయానికి అండ లభించింది. 

కలం పట్టుకొని  గెలిపించారు...
ఆ శిక్షణ స్మరణ్‌కు మాత్రమే కాదు. అతని తల్లికి కూడా. ఇద్దరికీ కలిపి పరీక్షలు నిర్వహిం చిన బాలలత... కొడుకు చెప్పే వేగాన్ని ఆమె అందుకోగలుగుతుందా? లేదా? అని పరీక్షిం చారు. అలా 37 పరీక్షలు నిర్వహించారు. కొడుకు కోసం పరీక్షలు రాసేందుకు ఏడాది పాటు ప్రాక్టీస్‌ చేశారామె. స్మరణ్‌ రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడితే.. ఆ అంశాలను వేగంగా రాసేందుకు నాగరాణి పోటీపడ్డారు.

తప్పుల్లేకుండా స్పష్టంగా రాసేందుకు యూట్యూబ్‌ శిక్షణ తీసుకున్నారు. నిమిషానికి రాయగలిగే అక్షరాలను లెక్కిస్తూ వేగం పెంచారు. ‘మొదట్లో గంటకో పేజీ రాయడం కష్టంగా ఉండేది. క్రమంగా 4 గంటల్లో  40  పేజీలు రాసే నైపుణ్యం వచ్చింది. స్మరణ్‌ చదివే పుస్తకాల్లోని అంశాలే రాయడం వల్ల సివిల్స్‌ పరీక్షల్లో ఇబ్బంది కాలేదు’ అని నాగరాణి చెప్పారు.  

అమ్మనే స్క్రైబ్‌.. ఎందుకంటే?
సాధారణంగా ఏ పరీక్షల్లో అయినా రాయలేనంత వైకల్యం ఉన్న వాళ్లు స్క్రైబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అభ్యర్ధి చెప్పే సమాధానాలను స్క్రైబ్‌ తప్పుల్లేకుండా, ఉన్నదున్నట్లుగా రాయాలి. ‘స్క్రైబ్‌గా వ్యవహరించేందుకు బయటివాళ్లు అందు బాటులో ఉండొచ్చు. కానీ వాళ్లకు మా అబ్బాయి గెలుపు పట్ల తపన, అంకి తభావం ఉండవు కదా.

అందుకే స్మరణ్‌ తల్లి ఆ బాధ్యతను తీసుకుంది’ అని స్మరణ్‌ తండ్రి రమేష్‌కుమార్‌ చెప్పారు. పైగా స్క్రైబ్‌గా వ్యవహరించేవాళ్లు యూపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలు రాసే అర్హతను కోల్పోతారు. ‘నాకు, మా అబ్బాయిని గెలిపించడం కంటే గొప్ప పోటీ పరీక్ష మరొకటి లేదు కదా’ అని నవ్వేశారు నాగరాణి. 

మరిన్ని వార్తలు