అమిత్‌షాతో పుల్లెల గోపీచంద్‌ భేటీ..

18 Sep, 2022 01:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌షా బిజీ షెడ్యూల్‌ మధ్య శనివారం గోపీచంద్‌ను ప్రత్యేకంగా కలుసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భేటీ అనంతరం గోపీచంద్‌ స్పందిస్తూ ఇద్దరం మర్యాదపూర్వకంగా కలిశామని.. తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు.

కేవలం క్రీడా పథకాలు, ప్రోత్సాహకాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ముందస్తు షెడ్యూల్‌ లేకుండానే ఈ భేటీ జరగడం గమనార్హం. గోపీచంద్‌ మాజీ శిష్యురాలు, ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ రెండేళ్ల క్రితం బీజేపీలో చేరారు. ప్రజల్లో ఆదరణ, గుర్తింపు ఉన్న వివిధ రంగాల వారిని బీజేపీలో చేర్చుకోవడం, వారితో ఎన్నికలప్పుడు ప్రచారం లేదా వారి అభిమానులు, ఇతర వర్గాల వారికి దగ్గరయ్యేందుకే వరస భేటీలు జరుగుతున్నాయని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు