బక్రీద్‌ బిజినెస్‌ ఎలా?

24 Jul, 2020 07:58 IST|Sakshi
నాదర్‌గుల్‌లో ఖాళీగా ఉన్న మేకల షెడ్‌

ఆసక్తి కనబర్చని సీజన్‌ వ్యాపారులు 

కనిపించని ఖుర్బానీ జీవుల సందడి 

వెంటాడుతున్న కరోనా భయం 

ఇళ్లకే పరిమితం కానున్న పండగ

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ కారణంగా సీజనల్‌ బిజినెస్‌లన్నీ ఢమాల్‌ అయ్యాయి. రంజాన్‌ను లాక్‌డౌన్‌ పూర్తిగా మింగేసింది. తాజాగా బక్రీద్‌ బిజినెస్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. బుధవారం నెలవంక దర్శనమివ్వడంతో ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జిల్‌హజ్‌ పవిత్ర మాసం ప్రారంభమైంది. సరిగ్గా  ఈద్‌–ఉల్‌–జోహా (బక్రీద్‌ పండగ)కు కేవలం తొమ్మిది రోజులే మిగిలిఉంది. అయినా ఖుర్బానీ జీవుల సందడికనిపించడం లేదు. వాస్తవంగాబక్రీద్‌కు పది రోజుల ముందు నుంచే ఖుర్బానీ జంతువులైన పొట్టేళ్లు, మేకపోతుల సందడి నగరంలో ఎక్కడచూసినా కనిపిస్తుంది. ఈసారి పరిస్థితి అలాలేదు. ఒకవైపు విజృంభిస్తున్న కరోనా, మరోవైపు ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వ్యాపారం అంత ఈజీ  కాదన్న భావన సర్వత్రా నెలకొంది. కొనుగోలుదారులు సగానికి సగం తగ్గే అవకాశాలుండడంతో బిజినెస్‌పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  

కోవిడ్‌ నేపథ్యంలో.. 
కరోనా వైరస్‌తో అందరికీ ప్రాణభయం పట్టుకుంది. బయటకు వెళ్లేందుకు జనం భయపడిపోతున్నారు. సంప్రదాయ పండగలు సైతం ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. ముస్లింలు ఇప్పటికే రంజాన్‌ నెల ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షల విరమణ, తవారీతో పండగ ప్రార్థనలన్నీ ఇళ్లలోనే జరుపుకున్నారు. ప్రతి ముస్లింకు ఖుర్బానీ తప్పనిసరి. బక్రీద్‌ ఖుర్బానీలు అత్యధికంగా  పాతబస్తీలోనే కనిపిస్తాయి. ప్రతి ఇంటా  కనీసం ఒక ఖుర్బానీకి తగ్గకుండా రెండు నుంచి నాలుగు ఖుర్బానీలు ఇస్తుంటారు. ప్రతి ఖుర్బానీలో మూడు భాగాలు చేసి అందులో ఒక భాగం బంధువులకు, మరో భాగం ఇరుగుపొరుగు వారికి పంపిణీ చేస్తారు. మిగిలిన భాగాన్ని ఇంట్లో వినియోగించుకుంటారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఖుర్బానీ మాంసం పంపిణీ కూడా అంత సునాయాసం కాదన భావన వ్యక్తమవుతోంది. ఖుర్బానీ మాంసం స్వీకరించే వారు సైతం సంశయించే  పరిస్థితి లేకపోలేదు. ఫలితంగా ప్రతి కుటుంబంలో ఖుర్బానీల సంఖ్య తగ్గి ఇంటికే పరిమితమయ్యే అవకాశాలుండొచ్చు.  

కరోనా పరీక్షలు.. 
బక్రీద్‌ పండగను పురస్కరించుకొని  మాంసం వ్యాపారులైన ఖురేషీ వర్గాల వారికి  కరోనా టెస్టులు చేస్తున్నారు. పాతబస్తీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు రోజులుగా  ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఖుర్బానీ జీవులను కోయడంలో ఖురేషీల పాత్ర అధికంగా ఉంటుంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా  వీరికి కరోనా పరీక్షలు ప్రారంభించారు. 

వందల కోట్ల వ్యాపారం  
వాస్తవానికి బక్రీద్‌ సీజన్‌ వచ్చిందంటే నగరంలో వందలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. చాలామంది నిరుద్యోగులు ఈ సీజన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. కానీ, కరోనా భయంతో ఆ పరిస్ధితి కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు