బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులకు బ్రేక్‌

7 Aug, 2020 08:15 IST|Sakshi

కొంతమంది సిబ్బందికి కోవిడ్‌ పనుల్లో తగ్గిన వేగం 

అక్టోబర్‌కల్లా పూర్తి కావడం కష్టమే..  

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చే బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులకు కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. పనులకు ఆదిలో ఆస్తుల సేకరణతో ఆలస్యం కాగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు వేగిరంగా సాగాయి. ప్రస్తుతం సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. పనులు చేస్తున్న బీఎస్‌సీపీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్, ప్రాజెక్ట్‌ మేనేజర్, కిందిస్థాయి సిబ్బందితో పాటు దాదాపు 10 మందికిపైగా కోవిడ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో పనుల్లో వేగిరం తగ్గింది. మిగిలిన 40 మందిలోనూ కలవరం మొదలవడంతో వారికి కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అక్టోబర్‌ నాటికి ఫ్లైఓవర్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. .   

కొనసాగుతున్న స్లాబ్‌ వర్క్‌.. 
బాలానగర్‌లోని శోభనా థియేటర్‌ నుంచి ఐడీపీఎల్‌ వరకు 1.13 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఫైఓవర్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రూ.387 కోట్లు కేటాయించింది. ఆస్తుల సేకరణకు రూ.265 కోట్లు, నిర్మాణానికి రూ.122 కోట్లు వ్యయం చేస్తోంది. 2017 ఆగస్టు 21న ఫ్లైఓవర్‌ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. దాదాపు రెండేళ్లకుపైగా ఆస్తుల సేకరణ జరగడంతో ఆ తర్వాత ఇంజినీరింగ్‌ పనులు మొదలయ్యాయి. ఇటీవల లాక్‌డౌన్‌ కాలంలో కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ఆదేశాల మేరకు పనుల్లో వేగిరం పెంచారు. మొత్తం 26 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. మూడు స్లాబ్‌లు పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్న క్రమంలోనే కాంట్రాక్ట్‌ చేపట్టిన కంపెనీ సిబ్బందికి కరోనా రావడంతో మిగిలినవారిలో అలజడి మొదలైంది. దీనిపై హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు మాట్లాడుతూ.. కొంతమంది సిబ్బందికి కరోనా వచ్చినట్టుగా తెలిపారు. అక్టోబర్‌ ఆఖరునాటికి ఫ్లైఓవర్‌ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.  

మరిన్ని వార్తలు