గ్రేటర్‌లో బ్యాలెట్టే

6 Oct, 2020 02:15 IST|Sakshi

కరోనా నేపథ్యంలో బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ నిర్ణయం: ఎస్‌ఈసీ

ఇంకా ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలకు కూడా...బ్యాలెట్‌ పోరువైపే మొగ్గు చూపిన మెజారిటీ రాజకీయ పార్టీలు

ఈవీఎంలతో వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశంవీవీప్యాట్‌లు అందుబాటులో లేకపోవడమూ కారణమేనని వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సహా ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలకు బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పేపర్లతో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉన్న సమయం, వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఇతరత్రా విషయాలపై సవివరంగా చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిం చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్స్‌లు, పత్రాలు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలు, ఎస్‌ఈసీ వద్ద రిజిస్టర్‌ అయి రిజర్వ్‌ సింబల్స్‌ పొందిన 39 రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరినట్లు ఎస్‌ఈసీ తెలిపింది.

దీనిపై స్పందించిన 8 గుర్తింపు పొందిన పార్టీల్లో ఐదు బ్యాలెట్‌ బాక్స్‌ వైపే మొగ్గుచూపగా ఒక పార్టీ ఈవీఎం ద్వారా ఎన్నికలకు మొగ్గుచూపింది. అలాగే 18 రిజిస్టర్డ్‌ పార్టీల్లో 11 బ్యాలెట్‌ బాక్స్‌ల ద్వారానే ఎన్నికలు జరపాలని కోరగా, రెండు పార్టీలు ఈవీఎంల వైపు మొగ్గుచూపాయని తెలి పింది. మిగతా 7 పార్టీలు ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని ఎస్‌ఈసీ పేర్కొంది. బ్యాలెట్‌తో పోల్చితే ఈవీఎంలతో ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.

అందుబాటులో లేని వీవీప్యాట్‌లు...
ఈవీఎంలకు వీవీప్యాట్‌ మెషీన్లను అనుసంధానించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో తమ వద్ద వీవీప్యాట్‌లు అందుబాటులో లేకపోవడంతో వాటి కోసం హైదరాబాద్‌ ఈసీఐఎల్, బెంగళూరు బీఈఎల్‌ల నుంచి కొటేషన్లు కోరామని ఎస్‌ఈసీ వివరించింది. అయితే దీనిపై వీవీప్యాట్‌ల తయారీకి ఢిల్లీలోని ఈసీ అనుమతి కోరుతూ ఆయా సంస్థలు లేఖలు రాశాయని, ఈసీ నుంచి ఇంకా జవాబు రావాల్సి ఉందని తెలిపింది. వీవీప్యాట్‌లు అందుబాటులో లేని కారణంగానే 2019లో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, 2020 మొదట్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ బాక్స్‌లతో నిర్వహించిన విషయాన్ని ఎస్‌ఈసీ ఈ సందర్భంగా గుర్తుచేసింది.

ఈవీఎం, వీవీప్యాట్‌లతో హైరిస్క్‌ వల్లే..
ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వినియోగానికి ముందు వివిధ ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉందని, అన్ని దశల్లోనూ తయారీదారుల పక్షాన పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది ప్రమేయం ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అంతేకాకుండా మూసి ఉంచిన గదుల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను శుభ్రం చేయడం, కట్టి ఉంచిన మిషన్లను తెరవడం, మళ్లీ ప్యాక్‌ చేయడం వంటి పనుల్లో భారీగా సిబ్బందిని నియమించాల్సి వస్తుందని తెలియజేసింది. ఈ విధంగా ‘హైరిస్క్‌ కమ్యూనిటీ’గా ఉన్న వారిని భాగస్వాములను చేయడం ద్వారా  ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తికి అధిక అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.

బ్యాలెట్‌ బాక్స్‌లు, ఈవీఎంలకు సంబంధించి...

  • 1989లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్లమెంట్‌ సవరించాక ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి వీలు ఏర్పడింది. 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించారు.
  • 1995 నుంచి 2019 వరకు జరిగిన అన్ని గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌ బాక్స్‌లతోనే జరిగాయి.
  • పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు 1995, 2000లో బ్యాలెట్‌ బాక్స్‌లతో... 2005, 2014లలో జరిగిన ఎన్నికలను ఎస్‌ఈసీ ఈవీఎంలతో(వీవీప్యాట్‌లు లేకుండా) నిర్వహించింది.
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి మొదటి సాధారణ ఎన్నికలను 2002లో బ్యాలెట్‌ బాక్స్‌లతో, 2009, 2016 ఎన్నికలు ఈవీఎంలతో(వీవీప్యాట్‌లు లేకుండా) జరిగాయి. 
మరిన్ని వార్తలు